27, ఏప్రిల్ 2016, బుధవారం

మనసు ముడి విప్పనా

స్వప్నాల్లో దృశ్యాదృశ్యంగా నువ్వు..
వెన్నెల సుధలు వసంతగీతాలై పల్లవిస్తుంటే...
ఆ స్వాప్నికానుభూతి అనంతంగానూ,
ఆ తర్వాత అంతా శూన్యంగాను
భ్రమింపజేస్తుంటే...
నీకోసం దాచిన స్వప్న గంధాన్ని ఏం చేయను?
ఎన్నాళ్లని వాటిని మోస్తూ ఈ శూన్య పథాన సంచరించను?
మల్లెలు విరిసే సంధ్యలా నీ ముందు మనసు ముడి విప్పాలనిపిస్తోంది
స్వప్నాలు.. స్వర్గాలు...
ఆకాశపు మృదుత్వం... మనసులోని మమకారం...
మదిలోని సున్నిత సొబగులు నీ దగ్గరే ఉన్నాయనిపిస్తోంది
నేను కోల్పోయిన వసంతాలను
నీ దగ్గర పొందగలనేమోననే అందమైన భావన..
నా హృదయపు శూన్యత నిండా నిండివున్న నువ్వు
ఊహలు... సుందర స్వప్నికలు లేని జీవితం వ్యర్థం కదూ
నా భావుకత అంతా మల్లెతీగలా నిన్ను అల్లుకుపోయింది
నీ ఊహలు నా ఎదలో మల్లెల పరిమళాలు నింపుతున్నాయి
పంచుకునే తోడుంటే మమతలు ఇంత మధురంగా వుంటాయని
నీ ఎదుట మనసు ముడి విప్పిన తర్వాతే తెలిసింది.

- రాజాబాబు కంచర్ల
27-04-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి