తెలుగు కథా సాహిత్యంలో తొలితరం కథకుల్లో
ముఖ్యులు చింతా దీక్షితులు. తెలుగు కథ నడకలు నేర్చుకుని సరైన మార్గంలో
పయనించడానికి బాటలువేసిన ముఖ్యుల్లో దీక్షితులు ఒకరు. భాషలో, శిల్పంలో
తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న కథకుడు. ఆయన రచించిన కథలను ఏకాదశి కథలు,
దాసరిపాట, హాస్యకథలు, మిసెస్ వటీరావు కథలు అని నాలుగు భాగాలుగా
వర్గీకరించి 'చింతా దీక్షితులు సాహిత్యం-2' పేరుతో ఈ సంకలనం ప్రచురించారు. ఈ
నాలుగు విభాగాల్లోనూ మొత్తం 42 కథలున్నాయి. ఏకాదశి కథల్లో 'శ్యామల' కథలో
కథానాయకుడు శ్రీధరరావు బ్రహ్మచారి. ఆయన ప్రేమించిన శ్యామల జబ్బు చేసి
మరణించడంతో ఒంటరిగా మిగిలిపోయాడు. హాస్యకథలు విభాగంలో డబ్బు డబ్బు డబ్బు,
ముడు కుక్కలు ముఖ్యమైనది.
అలాగే ఆంధ్రా దోమల సభ, పాకశాస్త్రం పరీక్ష, నీతిపాఠం కథల్లోని హాస్యం దీక్షితులు హాస్యప్రియత్వాన్ని మన కళ్లకు కడుతుంది. చింతా దీక్షితులు కథల్లో దాసరి పాట ప్రసిద్ధి చెందిన కథ. దాసరి బబ్బిలి కథ చెబుతుంటే జబ్బుతో ఉన్న అతని కొడుకు చనిపోతాడు. కొడుకు శవాన్ని భుజాన వేసుకుని దాసరి బబ్బిలి కథను గానం చేస్తాడు. కరుణారస భరితమైనదీ కథ. దాసరిపాట విభాగంలోనిదే మరో కథ 'సుగాలీ కుటుంబం'. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబించిన తొలి కథగా నమోదయ్యింది. సంచార జాతుల మీద రాసిన మొదటి కథ ఇది. లంబాడీల జీవితాన్ని వివరిస్తుందీ కథ. చెంచురాణి కథ కూడా ఈ కోవకు చెందిందే. అలాగే 'అభిప్రాయ భేదం' కథ ఆర్థికంగా సమాజంలో ఉన్నవారికి లేనివారికి మధ్య వున్న అంతరాలను ఎత్తిచూపుతుంది. మన సంప్రదాయాల్ని వదులుకొని అన్యజాతి సాంప్రదాయాల్ని అవలంబించే వారిపై మిసెస్ కటీరావు కథల ద్వారా రచయిత వ్యంగ్య బాణాల్ని సంధించారు. మిసెస్ వటీరావు కథలో 'వటీరావు ఎం.ఎ' పాత్రను సృష్టించి సంప్రదాయాలను కీర్తిస్తూ, ఆధునిక నాగరికతను నిరసిస్తూ చాలా కథలు రాశారు. ఈ విభాగంలో ఇవే కాకుండా గోదావరి నవ్వింది, కిష్కిందలో కోతి, పెద్ద మేడ ముఖ్యమైనవి. గోదావరి జిల్లా పదాలతో పాటు వివిధ మాండలిక పదాలు ఆయన కథల్లో కనిపిస్తాయి. ఈ పుస్తకంలో 'మన్మథ సందర్శనం' అనే కథను రెండు విభాగాల్లో వేశారు. ఒకే కథను ఒకే పుస్తకంలో రెండుసార్లు వేయడం బాగోలేదు.
ఈ పుస్తకంలోని అన్ని కథలూ ఆద్యంతం ఆసక్తికరంగా వుంటాయి. ప్రకృతిలోని ప్రతి అందాన్ని పట్టి చూపిస్తాయి. మనసును ఆర్ద్రతతో నింపుతాయి. సమాజంలోని వివిధ జాతుల జీవన విధానాల్ని పరిచయం చేస్తాయి. దీక్షితులు కథల్లో ప్రకృతితో పాటు ప్రణయం, హాస్యం, తాత్త్విక దృష్టి, పిల్లలను అలరించేవిగా మనకు కనబడతాయి. శిష్ట వ్యవహారికంలో వీరు రాసినా.. అక్కడక్కడ గ్రాంథిక వాసనలు కనిపిస్తాయి. అయినా చదువరులకు ఒక మంచి పుస్తకం చదివామన్న అనుభూతిని కలిగిస్తుందీ కథా సంకలనం.
- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి