12, ఏప్రిల్ 2016, మంగళవారం

సమాజంలోని అవకతవకలపై కళాత్మక విశ్లేషణ... ''కడుపుకోత'' కథాసంపుటి

తెలంగాణా మాండలికంలో వచ్చిన తొలి కథా సంపుటి 'కడుపుకోత'. ఈ సంపుటి కడుపుకోత కథతోనే ప్రారంభం అయింది. తెలంగాణా మాండలికం మీద మంచి పట్టున్న దేవరాజు మహారాజు రచించిన ఈ కథాసంపుటిలో పది కథలున్నాయి. ఈ పది కథల్లోనూ వారు ఎంచుకున్న కథా వస్తువు ప్రజాజీవనానికి సంబంధించిదే. నిత్యజీవితంలో మనం రోజూ చేసే సంఘటనలను వారు చక్కని కథలుగా మలిచిన వైనం చదువరులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.



ముఖ్యంగా ఈ సంపుటిలోని కథలను రెండురకాలుగా చెప్పారు రచయిత. ఒకటి : కథ మొత్తం తెలంగాణా మాండలికంలోనే వుంటుంది. రెండోది : కథను మామూలు భాషలో చెపుతూ... ఆయా పాత్రల సంభాషణలను మాండలికంలో పలికించారు. ఈ వైవిధ్యం చదువరులకు ఆసక్తికరంగా వుంటుంది.
ఈ సంకలనంలో మొదటి కథ 'కడుపుకోత'ా ''కమలమ్మను దవాకాన్ల శరీకు జేశిండ్రు. దానికి కడ్పునొప్పి. ఇయ్యాల్లనా నిన్ననా ఎన్నొద్దుల్నించి అగోరిస్తాంది'' అంటూ మొదలవుతుంది. ఈ కథ ఇతివృత్తం కంటే శైలి చక్కగా వుంటుంది. రచయిత కనబడకుండానే ముసలమ్మ పాత్ర ద్వారానే సమాజ స్వరూపాన్ని కళ్ల ముందు నిలబెడతారు. ఇక ఇందులో 'మూగమోసం' కథ ప్రత్యేకమైంది. ఈ కథంతా రైలులోనే జరుగుతుంది. అందరూ ఎవరో ఒకరిని ఏదోవిధంగా మోసం చేస్తున్నవారే. కళ్లెదుట మోసం జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు ఊరుకునే వారు కూడా మోసగాళ్లేనంటూ సమాజంలో జరుగుతున్న అవకతవకల్ని తనదైన శైలిలో చక్కని కళాత్మకతతో విశ్లేషించారు రచయిత.

మంచి ఇతివృత్తంతో కూడిన మరో కథ 'పాతగోడ'. దొర బంగళాకుా గ్రామానికి మధ్య చాలా ఎత్తుగా ఉన్న అడ్డుగోడ ఈ 'పాతగోడ'. ఆ గ్రామంలో దొరతానానికి చిరునామా ఇది. అలాంటి గోడ కూలిపోవడంతో దొరతనం కూలిపోయిందన్న అర్థం స్ఫురించేలా వుంటుంది. కూలిపోయిన గోడ రాళ్లమీదుగా గ్రామస్తులు నడుచుకుంటూ వెళోతోంటే.. దొర మానసిక సంఘర్షణ బాగా వర్ణించారు. అదేవిధంగా 'కోళ్లపందెం' కథలో ఊరి సర్పంచ్‌, కరణం తమ పాలేళ్లను కోళ్లకు మాదిరిగా ఉసిగొల్పి కొట్లాట పెడతారు. దొరల కోసం అయినవాళ్లే కొట్టుకొని దవాఖాన పాలవుతరు. సర్పంచ్‌ాకరణం మధ్య గ్రామస్తులు ఎలా నలిగిపోతున్నారో ఈ చిన్న కథలో వర్ణించారు. వీటితో పాటు మిగతా కథలు కూడా చదివించేవిగా, సమాజంలోని అవకతవకలను వేలెత్తి చూపుతాయి.

- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి