12, ఏప్రిల్ 2016, మంగళవారం

అక్షర తూణీరాలు.. గణపతిరావు కథలు

గణపతిరావు రచన చేసిన 'ఆకుపచ్చ అంటుకుంది' కథాసంకలనంలోని అన్ని కథలు సమాజంపై సంధించిన అక్షర తూణీరాలే. రచయిత సామాజిక దృక్పథమే ఈ రచనకు బలం చేకూర్చింది. సమకాలీన స్థితిగతులపై పదాల తూటాలను పేల్చుతూ.. కథను చెప్పడంలో తనదైన ఒక ప్రత్యేక శైలిని రచయిత అనుసరించారు. కథలకు పెట్టిన శీర్షికలు కూడా అర్థవంతంగా, ఆకర్షణీయంగా, ఆలోచనాత్మకంగా వున్నాయి. పుస్తకం ముఖచిత్రం నుంచి, ప్రతి కథనూ ప్రారంభించిన తీరు, ఆయా కథలకు వేసిన చిత్రాల వరకూ కథా సంకలనం యొక్క ప్రత్యేకతను చాటుతాయి.
'ప్రకృతిని కాపాడలేనివారికి జీవించే హక్కులేదు' అంటూ 'ఆకుపచ్చ అంటుకుంది' కథలో ఒక కాకితో చెప్పిస్తాడు రచయిత. ఈ కథ చదివితుంటే... అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు చేస్తోన్న ప్రకృతి విధ్వంసం గుర్తుకురాక మానదు. ఇలాంటిదే 'ఆకులు కాలాక చేతులు' కథ. కొమ్మలు, రెమ్మలు, ఆకులతో కళకళలాడే చెట్టు.. ఆ కొమ్మలు విరిగి,
పచ్చితనం పోయి, పొయ్యి కోసం ఎండు పుల్లల్లా తయారయ్యింది. వేళ్లు ... చెట్టుకి వీడ్కోలు చెప్పేశాయి.. వేళ్ల దగ్గర తల రాల్చి చెట్టూ.. శెలవు తీసుకుంది అని పర్యావరణానికి వాటిల్లిన ముప్పును, తద్వారా మానవ జీవనం అంతమయ్యే స్థితిని ఈ కథలో రచయిత చాలా హృద్యంగా చెబుతాడు. ఈ సంపులిలో మరో అద్భుత రచన 'తొడ గొట్టిన ద్రౌపది'. కథ మొత్తం భారతంలోని కథలాగే నడుస్తుంది. అయితే ఇందులో ప్రధాన పాత్ర ద్రౌపది. భారతంలో అర్జునుడి సారథిగా కృష్ణుడు వ్యవహరిస్తే.. ఈ కథలో ద్రౌపది సారథిగా వ్యవహరిస్తాడు. కౌరవ సభలో తనను అవమానించి దుశ్శాసనుడి రెండు చేతులను ఒకే కత్తివేటుతో నరికేస్తుంది. ఆధునిక స్త్రీవాద తత్వం ఈ కథలో ప్రస్పుటంగా గోచరిస్తుంది. తన సారథి కృష్ణుడికే ధైర్యవచనాలు చెబుతుంది 'శ్రీకృష్ణా' అని సంభోదిస్తూ. ''నన్నొక సాధారణ స్త్రీగా తలచుచున్నావు. అలా అనుకున్నా.. ప్రతి స్త్రీ కూడా సర్వశక్తిమంతురాలే, సర్వ స్వతంత్రురాలిగానే ఆలోచిస్తుంది' అంటూ ఆమె వ్యక్తిత్వాన్ని రచయిత చెప్పకనే చెబుతాడు.

ఇలా చెప్పాలంటే.... ఈ సంకలనంలోని అన్ని కథలూ దేనికదే ప్రత్యేకమైనవి. చదివిన తర్వాత ఈ కథల్లోని పాత్రలు.. ఆ పాత్రల వైచిత్రి మన మనసులను వెంటాడుతునే వుంటాయి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం ఇది.

- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి