అభాగ్యులు, మనసుండీి నలిగిపోయే మనుషులు, కాలచక్రం కర్కశ హస్తాల్లో చిక్కిన అమాయకులూ.... అడుగడుగునా పలకరిస్తారు సుబ్బరామయ్య కథల్లో. ఈ కథల్లో మృత్యువు కళ్లముందు కనిపిస్తున్నా, మనిషి మనిషిగా ప్రవర్తించే సహజ సన్నివేశాలు ప్రతి కథనూ ఆసాంతం చదివేలా చేస్తాయి. రచయిత వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే రోజువారీ ఘటనలనే కథావస్తువుగా తీసుకొని, తనదైన అద్భుత శిల్పంతో ప్రాణం పోసి వాటిని సజీవ కథలుగా రూపొందిస్తారు. దీనికి 'అర్జునుడు' కథనే ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ కథకు 'వీడు కౌంతేయుడు కాదు, మాములు నరుడే' అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ఇది ముగ్గురు స్నేహితుల కథ. ఎన్నో ఏళ్ల తర్వాత అర్జునుడు తన స్నేహితుడు దాశరథి దగ్గరకొచ్చి ఒక కోరిక కోరతాడు. 'నువ్వున్నావని, నాకు నువ్వు మాత్రమే వున్నావని భరోసాతో వచ్చాను... నన్ను ఆదుకోవాలి... ఇంకా నాకెవ్వరూ లేరు' అంటూ చేతులు పట్టుకున్న స్నేహితుడ్ని చేసి చలించిపోతాడు దాశరథి. 'నువ్వు మా అమ్మాయి భానుమతిని కొంతకాలం కడుపులో పెట్టుకుని కాపాడాలి' అంటూ తన కోరికను వెల్లడిస్తాడు. అర్జునుడికి పెళ్లికాలేదని తెలిసినా, తనలోని అనేక అనుమానాలను లోపలే దాచుకొని భానుమతి బాధ్యతను స్వీకరిస్తాడు దాశరథి. అర్జునుడు చనిపోయిన తర్వాత తమ చిన్ననాటి స్నేహితుడు కరీముల్లా కూతురుని, తను మిలిటరీలో చనిపోగా, అతని భార్య బిడ్డను ప్రసవించి చనిపోయిందనీ తెలుస్తుంది. నాడు నెత్తురుగుడ్డుగా చేతుల్లోకి తీసుకున్న ఆ బిడ్డను సురక్షితమైన చోటుకు చేర్చేందుకు అర్జునుడు పడిన మానసిక సంఘర్షణను హృద్యంగా వర్ణించారు రచయిత. స్నేహితుని బిడ్డ కోసం అర్జునుడు తన జీవితాన్నే త్యాగం చేస్తే.... ఒక పెద్ద రహస్యాన్ని మాత్రం ఎప్పటికీ తనలోనే వుంచుకునేందుకు సిద్ధపడి భానుమతి బాధ్యతను ఆనందంగా స్వీకరించిన సహృదయుడు దాశరథి. 'ఇన్నాళ్లు మనకిద్దరు... ఇప్పుడు ముగ్గురు' అనుకుంటారా దంపతులు.
ఇదొక్కటే కాదు... ఈ సంపుటంలోని కథలన్నీ మానవ సంబంధాలతో ముడిపడే వుంటాయి. మచ్చుకు ఒక కథ గురించే చెప్పినా.. మిగతా కథలూ ఆసక్తికరంగానే వుంటాయి. 'శిశిరవేళ' కథలో కథనం శీర్షికలోని అర్థాన్ని తలపింపజేస్తుంది. 'అరవై దాటిన తర్వాత బ్రతకడమే తప్పు'.. 'నీకెందుకీ విషయాలన్నీ, ఒక మూలపడి వుండక' అని దులిపేస్తారు... అంటూ తాతగారు అని పిలవడానికి ఒప్పుకోని ఓ తాత అంతర్మథనం ఈ కథ. అలాగే ప్రతి కథలోనూ ఆయా పాత్రల ఔచిత్యం, ఆ పాత్రలను మలిచిన తీరు చదువరులను కట్టిపడేస్తుంది.
- రాజాబాబు కంచర్ల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి