26, ఏప్రిల్ 2016, మంగళవారం

రెండవ రోజు

ఓ ప్రియమైన మేఘమాలా..

రాత్రంతా నీ ఆలోచనలే... నిదురే రాని ఈ కనులు స్వప్పించడమూ మానేశాయి.
నీవులేక చిన్నబోయిన మా పూదోటలో శాంతి కరువయ్యింది.
తోటలోని పూబాలలన్నీ మౌనవ్రతం బట్టాయి.
నీ తీయని స్వరం వినబడనిదే గాలిని కూడా పీల్చబోమని మారాం చేశాయి.
వాటిని లాలించి...ఊరడించి.. బుజ్జగించేసరికి వేకువ దాటింది
నా ప్రియమైన మేఘబాలా...
నీవెళ్లిన పడమటిలో గాలుల తీక్షణ, చలి తీవ్రత ఎక్కువగా వుండివుంటుంది. జాగ్రత్త సుమా...
అసలే సుకుమారివి... ఏమాత్రం వత్తిడి తగిలినా వర్షించేస్తావేమో...
ఇంకా ఏమిటి అక్కడి వింతలు, విశేషాలు... విడ్డూరాలు..
పడమటి మేఘాలు నిన్ను ఆదరిస్తున్నాయా...
ఆదరిస్తాయనే అనుకుంటున్నా...
ఎందుకంటే... నీ చాకచక్యం... నీలోవున్న ఆకర్షణ అలాంటిది.
ఎంతటివారైనా.. ఇట్టే స్నేహితులైపోతారు.
కొత్త స్నేహితుల ఆదరణలోపడి మన పూదోటను... ఆ తోటలోని పూబాలలను మరువకేం...
అసలే ఇక్కడి ఎండల తీవ్రతకు పూబాలలు వాడిపోతున్నాయి.
నీవులేని బెంగ కూడా తోడవడంతో మరింత నీరసించిపోతున్నాయి.
అందుకే నీకు మేఘసందేశం కూడా పంపాను.
మాకిక్కడ మధ్యాహ్నం రెండు గంటలైతే... నీకక్కడ తెల్లవారుజాము 4గంటలు.
మృదు మధురంగా.. కోయిల స్వరంలా వుండే నీ గొంతు.. నిద్రమత్తులో భలే హస్కీగావుందిలే.
నీ మాటలు విన్న తర్వాత మన పూదోటలోని పూబాలలన్నీ కాస్త ఉత్సాహం తెచ్చుకున్నాయి..


నీ జ్ఞాపకలతో...

రెండవ రోజు
26-04-16

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి