25, ఏప్రిల్ 2016, సోమవారం

తొలిరోజు


ఓ ప్రియమైన మేఘమాలా...

     నిత్యం మా వనంలో సంచరించే నువ్వు.
ఏ వైపునుంచి చూసినా ఎంత అందంగా కనబడేదానవో.
రుతువుల్లో వచ్చిన మార్పు మనని దూరం చేసింది...
నీవు పశ్చిమ దిశగా పూలతేరుపై నీ పయనం సాగించావు.
నీవు మోసుకొచ్చే పిల్లతెమ్మెరలు.. మలయమారుతాలు జాడలేక మా వనం బోసిపోయింది.
నీ మృదుమధురమైన స్వరంతో,  ప్రేమతో మాట్లాడే నీ మాటలు దూరమై... మా వనంలోని పూబాలలు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాయి.
ఏ స్వప్నమో... ఏ సౌందర్య దాహమో తెలియదు...
మా వనంలో నుంచి నిన్ను చూస్తుంటే మనసు పరవశించేది..
గుండె లయ తప్పేది...
తనువు అదుపు తప్పేది.
ఎంతో అందమైన ఈ పూదోట... నీవులేని ఈ నిమిషం కీకారణ్యాన్ని తలపిస్తోంది.
ఓ మేఘబాల...
పశ్చిమం నుంచి నువ్వొచ్చే వరకు విరహంతో వేగిపోతుంటాయేమో...
నువ్వొచ్చీ రాగానే రుతువులు మారతాయి...
వర్షిస్తాయి..
మళ్లీ మా వనం చిగుళ్లు వేస్తుంది...
విరబూస్తుంది...
ప్రేమసుమాలు వెదజల్లుతుంది.
అప్పటివరకూ ఎదురుచూస్తూ...

నీ జ్ఞాపకలతో...
తొలిరోజు
25-04-16

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి