11, ఏప్రిల్ 2016, సోమవారం

రాయలసీమ జన జీవన చిత్రణే 'రావణ వాహనం'

రాయలసీమ నేపథ్యంలో స్థానిక ప్రజల భాష, యాస, సంస్కృతికి ప్రతిబింబం 'రావణ వాహనం' కథలు. ఈ కథా
ఈ పుస్తక రచయిత డాక్టర్‌ వేంపల్లి గంగాధర్‌ నవలా రచయిత, కథకుడు, విమర్శకుడు, సామాజిక చరిత్రకారుడు, అధ్యాపకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని తెలుగులో మొదట అందుకున్న యువ రచయిత. ఈ సంపుటిలోని కథలన్నీ రాయలసీమ జీవిత మూలాలు రచయిత దృక్పథం నుంచి, ఆయన అన్వేషణ నుంచి జాలువారిన జీవన సత్యాలు. కరువు, కక్షలు కోణాన్ని స్పృశిస్తూనే వివిధ సామాజికాంశాలను ఇతివృత్తాలుగా తీసుకున్నారు. ముఖ్యంగా సీమ ప్రజల భాష కథలలోని పాత్రధారుల భాషగా మనకు కనిపిస్తుంది... వినిపిస్తుంది.

ఈ పుస్తకంలోని మొదటి కథ 'చీనీ చెట్లు'. ఈ చిన్న కథలోనే రాయలసీమ నేపథ్యం ఏమిటో అర్థవంతం విశ్లేషించారు. రెండు గ్రూపుల మధ్య వున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పోటీ మూడో పార్టీ రాకతో మలుపు తిరిగిన వైనం... ప్రస్తుత రాజకీయ వైచిత్రికి నిలువుటద్దం. మరో కథ 'ఏ ఊరికి ఏ దారి?'. ''స్వామీ మీరిచ్చే పరిహారం వద్దు. మా పంట భూమి మాకుంటేసాలు. మీరు మా పల్లెదిక్కే రావాకండి... అని శెట్టిగుండ పంచాయతీ రైతులు మొన్న ఆఫీసర్ల కార్లు పల్లెలోకి రానీయకుండా దావలోనే అడ్డం కూకున్నారు'' ఈ కథ చదువుతుంటే కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రంలో రాజధాని కోసమనీ, ఎయిర్‌పోర్టుల కోసమనీ ఊర్లు, పొలాలపై ప్రభుత్వం దృష్టి సారించిన విధానం మన కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఫ్యాక్షన్‌ పడగ నీడలో చితికిపోతున్న పల్లెల దుస్థితికి అద్దంపడుతుంది 'రావణవాహనం' కథ. 'మీ పల్లెలో ఫ్యాక్షన్‌ ఇంగా వుండాదా? అని మీసాలు దువ్వుకుంటా అడిగినాడు పోలీసు. ఏంజెపితే ఏమైతాదోనని సన్నోళ్లు నీళ్లు నమిలినారు'..., 'భయపడ్తా బతకలేం రా. తెగింపు వుండాల. ఎల్లకాలం వాడ్డే వుండడు. ఈసారి రాని కొడుకుల్ని ఉప్పు పాతరేస్తా..' వంటి సంభాషణలను ఈ కథ నేపథ్యాన్ని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ కథలన్నిటిలో కాస్త విభిన్నంగా వుండే కథ 'నక్షత్ర తాబేళ్లు'. దట్టమైన లంకమల అడవిలో లేత గోధుమ రంగులో, నలుపు మచ్చలు నక్షత్ర రూపంలో వుండి, దేహం పసుపు చారలతో వుండే నక్షత్ర తాబేళ్లు కొండలో దండిగా వుండాయి. ఈ తాబేళ్లకు విదేశాల్లో మాంచి గిరాకీ. వాస్తు కోసం, ఇళ్లలో అందం కోసం వీటిని పెంచుకుంటూ వుంటారు. అడవుల్లో వీటిని పట్టుకొని దొంగతనంగా స్మగ్లర్లకు చేరవేస్తే అక్కడి స్థానికులకు వచ్చేది నూటాయాభై రూపాయలు. అదే తాబేళ్లను విదేశాల్లో లక్షకో, లక్షన్నరకో అమ్ముకుంటారు. ఒకవైపు స్మగ్లర్ల దోపిడీ, మరోవైపు పోలీసుల నిర్బంధం ఈ కథలో కళ్లకు కట్టారు రచయిత.
సంపుటిలో 25 కథలున్నాయి. ఇవన్నింటిలోనూ కథ, కథనం చక్కని శైలితో ఆకట్టుకునే చిన్నచిన్న కథలు. రచయితకు స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన వుండడం కూడా ఒక కారణం. ఈ పుస్తకంలోని కథావస్తువును వర్తమాన సామాజిక వాస్తవికతను రాయలసీమ నేపథ్యం నుండి విమర్శనాత్మకంగా, కళాత్మకంగా ఆవిష్కరించారు.

ఇవేకాకుండా ఈ కథల సంపుటిలోని కథలన్నీ వాస్తవికతకు ప్రతిరూపాలే. మొత్తంగా చూసినప్పుడు రాయలసీమ జన జీవన జీవిత చిత్రణ, నేటి రాజకీయ వాస్తవ దృశ్యం ఈ కథా సంపుటిలోని కథలన్నింటిలోనూ అగుపిస్తుంది. సీమ గ్రామీణాన్ని అర్థం చేసుకోడానికి ఈ కథలు కొంత వరకూ ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ ఎంచక్కా చదవదగిన పుస్తకం ఇది.
                                                                                                                            - రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి