30, నవంబర్ 2016, బుధవారం

నీకెలా తెలుపను..

రాతి గుండెను మీటి
రాగాలు పలికించిన
రాగమయి నీవని
నీకెలా తెలుపను...
నీ పరిచయంతో
శిల శిల్పంగా మారిన వైనాన్ని
నీకెలా తెలుపను...
యాంత్రికమైన జీవితంలోకి
పిల్లతెమ్మెరలా వచ్చి
మల్లెల సుగంధాలు పూయిస్తున్నావని
నీకెలా తెలుపను...
నీతో మాట్లాడే ప్రతిక్షణం
నీ ప్రేమలో నేను పొందే అమరసౌఖ్యమని
నీకెలా తెలుపను...
నీకోసం చేసే ప్రతి పనిలో
నేననుభవించే ఆనందాతిశయాన్ని
నీకెలా తెలుపను...
కళ్లు మూస్తే ఎక్కడ కరిగిపోతావోనని
నిద్రలేని రాత్రులు గడిపే కనురెప్పల స్థితిని
నీకెలా తెలుపను...
నా ఎద లోగిలికి స్వాగతం పలుకుతూ
నీ అడుగుల సవ్వడి కోసం నిరీక్షిస్తున్నానని
నీకెలా తెలుపను...
- రాజాబాబు కంచర్ల
03-07-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి