29, నవంబర్ 2016, మంగళవారం

నేడు చలం పుట్టినరోజు


నేడు చలం పుట్టినరోజు (19-05-1894)
-------------------------
చలం...
ఒక చలనం.. సంచలనం
ఒక నిర్ణిద్ర సముద్రం
ఒక మహా జలపాతం
ఒక ఝంఝానిలం
చలం...
ఆంధ్ర సాహిత్యంలో ఒక సుడిగాలి
సంఘంలో.. సాహిత్యంలో... ప్రజల ఆలోచనలలో...
తరతరాలుగా పేరుకుపోయిన కల్మషాన్ని కడిగేసిన దీశాలి
కొత్త గాలులకు తలుపులు తెరచి
కొత్త భావాలకు లాకులు ఎత్తిన సవ్యసాచి

తెలుగు వచన స్వరూపాన్ని
రచన స్వభావాన్ని మార్చివేసి
సమకాలిక రచయితలపైన
తర్వాతి తరంపైన తన ముద్రవేసిన వైతాళికుడు
తనపై విమర్శలకు చలించక
నమ్మిన సిద్ధాంతం కోసం
ఆ విలువల కోసం
పుంఖానుపుంఖాలుగా రచనలు చేసి
సంఘంలోని
చెత్తా చెదారం, దుమ్మూ దూగర
ఎగరగొట్టిన సంస్కర్త
స్త్రీకి పురుషునితో సమానమైన హక్కులుండాలని
ఆమె ఒక వ్యక్తి అని,
ఆమెకొక వ్యక్తిత్వం ఉంటుందని,
ఆమెకూ సొంత ఇష్టానిష్టాలు, అభిరుచులు,
స్వేచ్ఛానురక్తి ఉంటాయని
తాను పిల్లలను కనే,
వంట చేసి మరబోమ్మ కాదని
పురుషునికున్న స్వేచ్ఛ స్త్రీకీ ఉండాలని
ఘోషించిన అభ్యుదయవాది
చలం రచనలు
ఆంధ్రదేశంపై విరుచుకుపడిన ఉప్పెన
నవలలు, నాటకాలు, కథలు, ఇతర రచనలతో
అసాంప్రదాయిక భావాలతో
తెలుగువారిని ఉక్కిరి బిక్కిరి చేసిన అసాధారణ రచయిత
సంఘ దురాచారాల మీద
మూఢ విశ్వాసాల మీద
కుల మత కట్టుబాట్ల మీద
ధ్వజమెత్తి..
స్త్రీల స్వేచ్ఛ కోసం..
స్త్రీల సాంఘిక న్యాయం కోసం
పరితపించిన మానవతావాది
చరిత్ర ఉన్నంతకాలం
చలం ముద్ర శాశ్వతం
చలం జ్ఞాపకం శాశ్వతం
చలం మాట నిత్య చలనం
- రాజాబాబు కంచర్ల
19-05-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి