29, నవంబర్ 2016, మంగళవారం

సరోగసీకి సరైన అర్థం చెప్పిన 'పూలకుండీలు'


'కుపచ్చ విధ్వంసం' నవలతో నవలా రచయితగా ఆవిర్భవించిన శిరంశెట్టి కాంతారావు మరో అద్భుత రచన 'పూలకుండీలు'. కవి, కథకుడు, నవలాకారుడుగా అన్ని పార్శ్వాలను స్పృశించిన శిరంశెట్టి... పవిత్రమైన మాతృ గర్భాన్ని కూడా అంగడి సరుకుగా మార్చేసిన ఆధునిక వ్యవస్థ అని చెప్పుకునే అస్తవ్యస్థ వ్యవస్థ వికృతరూపాన్ని 'పూలకుండీలు' నవల ద్వారా బట్టబయలు చేశారు. నిరుపేద అద్దె గర్భపు తల్లుల ఆక్రోశాన్ని అత్యంత హృద్యంగా చిత్రించారు. తొమ్మినెల్ల పేగుబంధపు ప్రతిరూపం ఎలావుందో ఒక్కసారన్నా కళ్లారా చూసుకునే అవకాశం ఇవ్వకుండానే పూలకుండీల నుంచి వేరుచేసిన మొక్కల్లా క్షణాల్లో తల్లీ బిడ్డలను వేరేసి ఎగరేసుకుపోతారంటూ రచయిత తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. నవలా శీర్షిక కూడా అర్థవంతమైన ఎంపిక. పేదరికాన్ని ఆసరాచేసుకుని కొన్ని ఏజెన్సీలు పేదరాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాయి. సరోగసీ (అద్దెగర్భం) నేడు మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ విచ్చల విడిగా వేళ్లూనుకుంటోంది. మన దేశంలో 5000 మిలియన్లకు పైగా ఈ వ్యాపారం సాగుతోందని ఒక అంచనా.
పేదరికాన్ని అడ్డుపెట్టుకొని మధ్య దళారీలు, వడ్డీవ్యాపారులు, మైక్రో ఫైనాన్స్‌ వంటి సంస్థలు పేదల రక్తాన్ని పీల్చుతూ.. వాళ్ల జీవితాలను ఎలా ఛిద్రం చేస్తారో కళ్లకు కట్టినట్లు వర్ణించారు రచయిత. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసపోతున్న పేదలు సరైన సమయానికి ప్రభుత్వం బిల్లులు చెల్లించక, పూరి గుడిశలతో తెల్లారిపోతున్న తమ
బ్రతుకుల్లో చిన్న డాబా ఇల్లయినా నిలుపుకోవాలని ఆశ పడితే, ఆ ఆశను సొమ్ము చేసుకునే అధికారులు, దళారీల కథ ఇది. ఇల్లు కట్టుకోడానికి ఇచ్చిన వడ్డీలు కట్టలేక చివరికి తమ ఆశల సౌధాన్నే వారికి తాకట్టు పెట్టడం, తాకట్టు పెట్టిన ఇంటిని కూడా అప్పుల కింద వాల్చుకోవడం... ఇత్యాది వాస్తవ సంఘటనలన్నింటినీ కూర్చి చిన్న ఇల్లు కట్టుకోడానికి తన జీవతాన్ని ఫణంగా పెట్టిన ఒక పేదరాలి జీవితం... ఓ సజీవ దృశ్యం ఈ నవలారూపం.
కథలోకి వెళితే... వృద్ధులైన తల్లిదండ్రులు, భార్య, నలుగురు పిల్లలతో పెద్ద సంసారం ఎల్లయ్యది. ఏదోక కూలి పనిచేసే ఎల్లయ్యతో పాటు భార్య శాంతమ్మ కూడా నాలుగిళ్లలో పనిచేస్తూ సంసారాన్ని లాక్కొస్తుంటుంది. పాతకాలం నాటి మూడుగదుల చిన్న పెంకుటిల్లు వీరి నివాసం. వీళ్లుండే కాలనీలో అందరూ ఇందిరమ్మ ఇళ్లు కట్టించుకుంటుంటారు. తనకూ ఓ డాబా ఇల్లు కావాలని కోరుకుంటుంది శాంతమ్మ. ఆ విషయాన్నే భర్త, అత్తమామలకు చెబుతుంది. వాళ్లంతా వద్దని వారించినా డాబా కట్టుకోవాలనే కోరికతో ఆర్‌ఎంపి లింగయ్య దగ్గర అప్పు చేస్తారు. ఇల్లు కట్టడం మొదలు పెడతారు. ఇంటిని పూర్తి చేయడం కోసం తమ కలల సౌధంగా భావించిన ఇంటిని కూడా తాకట్టు పెడతారు. ఇల్లు పూర్తికాకపోగా, కుటుంబం గడవడమే కష్టమౌతుంది. ఈ పరిస్థితిలో పనికోసం ఎల్లయ్య బొంబాయి వెళతాడు. ముసలి అత్తమామలు, నలుగురు పిల్లలను పోషించే బాధ్యత శాంతమ్మపై పడుతుంది. ఎంత కష్టపడినా వడ్డీలు కట్టడానికి, కుటుంబ పోషణకు గడవక అష్టకష్టాలు పడుతుంటారు. దీన్ని అవకాశంగా తీసుకున్న లింగయ్య సరోగసీ (అద్దెగర్భం) ప్రతిపాదనను శాంతమ్మ ముందు పెడతాడు. వారి బలహీనతను ఆసరాగా చేసుకొని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. మూడు లక్షలకు ఒప్పందం కుదుర్చుతాడు. హైదరాబాద్‌లో ఉండే మధ్యవర్తులకు 50వేలు ఇవ్వాలంటాడు. చివరకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో సరోగసీ ప్రక్రియ ప్రారంభమౌతుంది.
దీనికి ఫ్లాష్‌బ్యాక్‌లో అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసుకునే కిశోర్‌, అనితలు తమ ప్రొఫెషన్‌లో పడి పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోతారు. డాక్టర్‌ విశ్వామిత్ర సలహా మేరకు సరోగసీ ద్వారా బిడ్డను పొందేందుకు సిద్ధపడతారు. అమెరికాలో అయితే సుమారు పాతిక లక్షలు ఖర్చయ్యే ఈ ప్రక్రియకు ఇండియాలో సుమారు 12లక్షలతో పూర్తవుతుందని చెబుతారు. అలా హైదరాబాద్‌ వచ్చి ఈ కార్పొరేట్‌ ఆసుపత్రిలో సంప్రదిస్తారు. మధ్య దళారుల ద్వారా సరోగేట్‌ మదర్‌ను ఏర్పాటు చేసే పని ఆ ఆసుపత్రి స్వీకరిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో తన గర్భాశయాన్ని అద్దెకిచ్చే బీదరాలికి మిగిలేది చాలా స్వల్పం.
బొంబాయి నుంచి వచ్చిన ఎల్లయ్య విషయం తెలుసుకొని తల్లిదండ్రులు పిల్లలతో సహా ఆసుపత్రి ముందు బైఠాయిస్తాడు. ఆసుపత్రి యాజమాన్యం వాళ్లపై పోలీసులను ఉసిగొల్పుంది. బైట జరుగుతున్న తతంగమంతా ఆసుపత్రి ఆయా ద్వారా తెలుసుకున్న శాంతమ్మ దెబ్బతిన్న బెబ్బులిలా మారుతుంది. ఈ ఆసుపత్రి బండారమంతా బయటపెడతా... 'కడుపున పుట్టిన బిడ్డలంటే ప్లాస్టిక్‌ సంచుల్లో పెంచే జామాయిలు మొక్కలు కాదు... వేళ్లు సాగంగనే ఆ సంచుల్లో నుంచి తీసి ఇంకోసోట నాటడానికి..'. అంటూ నెలలు నిండిన శాంతమ్మ ఆగ్రహంతో ఊగిపోతుంది. ఆయా సాయంతో ఆసుపత్రి నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది. ఆమె ఎక్కడ డెలివరీ అయ్యింది వంటి విషయాలను ఆసక్తికరంగా మలిచారు రచయిత. ప్రతి ఒక్కరూ చదవాల్సిన మంచి పుస్తకం ఈ 'పూలకుండీలు'.
సరోగేట్‌ మదర్స్‌ నిజంగా పాల్వంచలో ఉన్నారో లేదో తెలియదు కానీ... సరోగసీ అనే ఒక వాస్తవిక అంశాన్ని తీసుకొని, స్థానికతతో మేళవించి.. అద్భుతంగా రాశారు. భాష, యాస, వారి జీవన విధానం, ఎల్లయ్య-శాంతమ్మల అన్యోన్యత... చక్కగా చిత్రించారు. ముఖ్యంగా శాంతమ్మ పాత్రను మలిచిన తీరు చక్కగా వుంది. ఆ పాత్రలోని అమాయకత్వం, వ్యక్తిత్వం... జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేని నిశ్శహాయత, ఆ నిశ్శహాయత నుంచి వెల్లువలా ఎగసిపడిన తెగింపు... చాలా సహజంగా కనిపిస్తుంది. ఈ నవల చదివిని చాలా రోజులు పాత్ర మనను వెంటాడుతుంది. అంత సహజత్వం ఉట్టిపడుతుంది శాంతమ్మ పాత్ర చిత్రణ.
'కన్నప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎంత బలీయమైనదో యశోదాకృష్ణుల ద్వారా చాటిచెప్పిన మట్టిలో పుట్టిన వాళ్లు.. ఆ ప్రేమను మర్చిపోవడమే ఇప్పటి దౌర్భాగ్యం...'
'గర్భాశయ ఇబ్బందుల కారణంగా సంతానం పొందలేకపోతున్న కొందరు స్త్రీల దుఃఖాన్ని రూపుమాపడం కోసం కనుగొనబడిన ఈ సరోగసీ ప్రక్రియను కూడా కొంతమంది స్వార్థపరులైన డాక్టర్లు తమ వృత్తి ధర్మానికి భిన్నంగా, కేవలం డబ్బుకోసం దుర్వినియోగం చేస్తున్నారు..' అంటూ డాక్టర్‌ విశ్వామిత్ర ద్వారా సరోగసీ పట్ల తన అభిప్రాయాన్ని రచయిత స్పష్టం చేశారు.
రచయిత ఎన్నుకున్న కథావస్తువుకు శిల్పం మరింత వన్నె తెచ్చింది. ఎక్కడా సుత్తిలేకుండా సూటిగా సరోగసీ విధానం దుర్వినియోగమౌతున్న వైనాన్ని, దానివల్ల జరుగుతున్న అనర్థాలను ఎండగట్టారు. దీనిపై రచయిత చేసిన పరిశోధన, పరిశీలన, దానికి నవలా రూపం ఇవ్వడంలో చూపిన చాకచక్యానికి రచయిత శిరంశెట్టి కాంతారావు గారిని అభినందించాలి.
- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి