2, మే 2016, సోమవారం

'నిశ్చల'మైన ప్రేమకథ

      'నిశ్చల'మైన.. స్వచ్ఛమైన ప్రేమకథ... ఉండవిల్లి.ఎం రాసిన ఈ నవల. చక్కని ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. కాలేజీ నేపథ్యంలో జరిగే ప్రేమలు... అది దాటి బయటికొస్తే సమాజంలో ఎదురయ్యే సమస్యల సుడిగుండాలు... వాటిని ఎదుర్కొని నిలబడగలిగే ఆత్మవిశ్వాసం... నలుగురికీ స్ఫూర్తినిచ్చే ఆదర్శవంతమైన జీవితం... వెరసి ఒక మధ్య తరగతి యువతి జీవితంలో ఎదురైన అనేక కోణాలను రచయిత చక్కని శైలితో అక్షరీకరించారు. ముఖ్యంగా కథానాయిక నిశ్చల పాత్ర చిత్రీకరణలో తొణకని వ్యక్తిత్వాన్ని నిండుగా నింపారు. మిగతా కథంతా ఈ పాత్రను అల్లుకొనే వుంటుంది గనుక ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.
అందం, అణకువ, ఆత్మాభిమానం, తొణకని వ్యక్తిత్వం వున్న మధ్యతరగతి అమ్మాయి నిశ్చల. అనుకోకుండా ప్రేమలో పడుతుంది. సంతోష్‌ని

గాఢంగా ప్రేమించింది. అంతకుమించి అతణ్ని ప్రగాఢంగా విశ్వసించింది. మనసైన వాడితో జీవితాన్ని పంచుకోవాలనుకుంటుంది. తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించరని భావించి హైదరాబాద్‌ వెళ్లడానికి నిశ్చయించుకొని రైలెక్కుతారు. మధ్యలో ఊహించని విధంగా సంతోష్‌ అదృశ్యమయ్యాడు. కోటి ఆశలతో వచ్చి, మూడుముళ్ల బంధంతో ఒక్కటై, సంతోషంగా జీవించాలనుకున్న నిశ్చలకు సంతోష్‌ అదృశ్యం ఒక మిస్టరీలా మారుతుంది. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్న ఆమెను ఓ రిక్షావాడు మోసం చేసి వ్యభిచార వాటికకు చేర్చుతాడు. వ్యభిచార గృహాన్ని నడిపే పానకాలమ్మ ఘాతుకానికి నిశ్చల బలైపోతుంది. ఎలాగైనా అక్కడినుంచి తప్పించుకోవాలనుకున్న ఆమెకు నీల సహాయం చేస్తుంది. అక్కడి నుంచి తప్పించుకున్న నిశ్చల విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడ అనుకోకుండా కలిసిన తన క్లాస్‌మేట్‌ భాస్కర్‌ ఆశ్రయం పొందుతుంది. వారి మధ్య జరిగిన అనేక సంఘటనల నేపథ్యంలో అతనికి చెప్పకుండా అక్కడినుంచి చెన్నైకి బయలుదేరుతుంది. ఓ మోసగాడి వలలో చిక్కుకుని ఇంటినుంచి వెళ్లిపోతున్న భాస్కర్‌ చెల్లెలు ట్రైన్‌లో కనిపిస్తుంది. విషయం తెలుసుకొని అతడి మోసాన్ని బయటపెట్టి, ఆమెను క్షేమంగా ఇంటికి పంపిస్తుంది. అదే ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్న విశ్వం అనే వ్యక్తి నిశ్చల కథనంతా తెలుసుకొని, తన గురించీ చెబుతాడు. నన్ను నమ్మి నాతో వస్తే నీకో ఆధారం చూపుతానంటాడు. అతని మాటలను విశ్వసించిన నిశ్చల వాళ్ళింటికి వెళుతుంది. అక్కడి గిరిజన ప్రాంతమంతా తిరిగి, వారికి సేవ చేసేందుకు సిద్ధపడుతుంది. విశ్వంతో పాటు ఇతర స్నేహితులంతా అక్కడ కలుస్తారు. వారందరూ కలిసి ఏం చేశారు అనేది ఈ నవలకు ముగింపు. అయినవాళ్లకు దూరమై, ప్రేమించినవాడు ఏమయ్యాడో తెలియక ఒంటరిగా మిగిలిపోయిన నిశ్చల జీవితం ఏ మలుపు తిరుగుతుంది? ఆచూకీ తెలియకుండా పోయిన సంతోష్‌ ఏమయ్యాడు? నిశ్చల కుటుంబ పరిస్థితులు ఎటువంటి మలుపు తిరిగాయి? నిశ్చల ఆధ్వర్యంలో నడిచే 'హ్యూమన్‌ టవర్స్‌' పరిస్థితి ఏమయింది? వంటి అనేక ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం... ఈ నవలను చివరి వరకు చదవడమే.
- రాజాబాబు కంచర్ల
(ప్రజాశక్తి సండే మ్యాగజైన్ స్నేహలో
01-05-2016న ప్రచురితం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి