30, ఏప్రిల్ 2016, శనివారం

అయిదవ రోజు



ప్రియమైన నీలి మేఘమా...

కాసేపు నీతో మాట్లాడాలని వుంది.
రోజంతా నీ మాట వినక..
నిస్తేజం అయిపోయింది మనసు.
ఇలావచ్చి గుండెలపై వాలిపోవా..
నిలువెల్లా ప్రేమను వర్షించే నీ కళ్లలోకి
అలా చూస్తుండిపోనివ్వవా
ఈ ప్రపంచంతో సంబంధంలేనంతగా...
ఊహల ఊపిరిలో ఇలా ఎంతకాలం బతకమంటావు
తొలిసారి చూసినపుడే కల నిజం చేసుకున్నా
నీ చివురు పెదవి తాకి ఎద సొదలను విన్నా
ఆ అధరాల తాకిడితో అమరత్వాన్ని నింపవా
ఓ నీలిమేఘమా...
ఈ ఎడబాటు తాత్కాలికమే అయినా భరించలేనిది.
ఊరుకాని ఊరులో
దేశంకాని దేశంలో
ఎలా వుంటున్నావో
ఏం చేస్తున్నావో
బెంగగా వుంది...
కలగా మిగిలిపోతుందనుకున్న
నా జీవితంలోకి వెలుగై వచ్చిన
నా మనసులోని మనసా...
జోల పాడటానికి రానా
నిలువెల్లా నిను ముద్దులతో ముంచెయ్యనా...

నీ జ్ఞాపకాలతో...

అయిదవ రోజు
29- 04-2016

నీ నవ్వుల్లో నే జీవిస్తున్నా

జీవన గమనం
హృదయాన్ని బరువెక్కించిన వేళ
మాటలెరిగిన మనసు
మౌనం దాల్చిన వేళ
సంధ్య వెలుగులు
తన జ్ఞాపకాలను ప్రోదిచేస్తున్న వేళ
కనుల ముందున్న రూపం
రెప్పవెనుక స్వప్నంలా మారుతున్న వేళ

వెన్నెల  జలపాతంలా
తొలి పొద్దుపొడుపులా
వలపుల హరివిల్లులా
నన్నావహించావు ఆత్మలా

నీ నవ్వుల్లో నే జీవిస్తున్నా
నీ మాట్లల్లో  నన్నే చూస్తున్నా
కంటిపాపలో వెలుగై నిలుచున్నా..
నీ శ్వాసనే నా ఊపిరిగా మార్చుకున్నా
ఎంత దూరాన నీవున్నా
నీతోనే నేవున్నా

- రాజాబాబు కంచర్ల
30-04-2016

28, ఏప్రిల్ 2016, గురువారం

నువ్వూనేను... ఒకటి

కటి ఒకటి కలిస్తే...రెండు
నువ్వూ నేను కలిస్తే... ఒకటి
ప్రకృతిలో ఒకటయ్యే ప్రతి రెండూ
తిరిగి ఒక్కటవుతాయి...
మలయమారుతమై పలకరిస్తావా
నీలి మేఘమై వర్షిస్తా...
అవనివై నను స్వీకరిస్తావా
తొలకరి మొలకై పులకరిస్తా
అలవై ఎగసిపడతావా
చెలియల కట్ట నేనవుతా..
రాగం నీవయితే
తానం నేనై పల్లవిస్తా
మయూరంలా నర్తిస్తావా
కాలి అందియనై రవళిస్తా
కావ్యనాయిక నీవైతే
నిను వర్ణించే ప్రతి అక్షరం నేనవనా..
పూబాల నీవైతే..మధుపం నేనవనా..
మల్లియ నీవైతే.. సౌరభం నేనవనా
హేమంత తుషారం నీవైతే...
వడిసి పట్టుకొనే గరికను నేనవనా
జాబిలమ్మ నీవైతే...
వెన్నెల వాసంతం నేనవనా..
మది నిండిన నీరూపం ఎప్పటికీ సజీవ దృశ్యం
నీపై నా ప్రేమ ఎప్పటికీ చెలిమెల ప్రవాహం
నిన్నటి కన్నా నేడు
నేటి కన్నా రేపు
పెరుగుతుండేదే నా ప్రేమ
అది పిల్ల తెమ్మెరలా స్పృశిస్తుంది
మల్లెతీగలా అల్లుకుంటుంది
చెలికాని కౌగిలిలో సేదతీరుతుంది
రెండుగా కనిపించినా వాటి ఆత్మలు ఒక్కటే
ఎప్పటికీ నువ్వూ...నేను ఒక్కటే

- రాజాబాబు కంచర్ల
29-04-2016

నాల్గవ రోజు

ప్రియమైన మేఘమాల....
ఎక్కువమంది జీవితంలో సంతోషం కొన్ని ఘడియల అతిథి మాత్రమే.
విచారం మాత్రం చాలాదూరం మనతో చాలా దూరం వరకూ తోడుగా వస్తుంది.
విచారాన్ని మరపించి... సంతోషంతో చెలిమి చేయించిన నీవంటే
మా పూదోటలోని ప్రతి కుసుమానికి ఎంతో అభిమానం.
నీలి మేఘమా...
నీవు నా తోటకు వచ్చిన రోజు మా జీవితంలో శరత్ జ్యోత్స్నలు కురిసిన రోజు.
నీ మనసులో స్థానమిచ్చి అనురాగం కురిపించిన రోజు.
వడలిన తీగెకు ప్రాణమిచ్చి, ఆత్మవిశ్వాసం పెంచి, వేళ్లూనుకునేలా చేసిన రోజు...
అందుకే...
నీ పట్ల అంత మమకారం పెంచుకున్నాము.
ఈ రుతువు అన్నిరోజులు హాయిగా గడిపి
నూతనోత్సాహంతో ఈ దేశానికి తరలిరావా...
అందాకా... నీ సందేశం మాకు అందుతూ వుంటే
ఎంతో ఉత్తేజం నిండుతుంది మా మదిలో
ఆ ఉత్తేజంతోనే నీవొచ్చే వరకూ
క్షణాలు యుగాలుగా తడబడుతుంటే...
నిస్సత్తువగా చూస్తుండడం మినహా ఏం చేయలేక...
నీకోసం ఎదురుచూస్తూ...

నీ జ్ఞాపకాలతో...

నాల్గవ రోజు
28- 04-2016

27, ఏప్రిల్ 2016, బుధవారం

మూడవ రోజు

ఓ ప్రియమైన మేఘమాలా...

 ఎలావున్నావు... నీ మాటలు కాసింత ఊరటనిచ్చింది తెలుసా...
ఏమిటో ఈ పచ్చి రోజురోజుకూ...
కొద్దిరోజులుంటే ఇప్పుడున్నంత గాఢత వుండన్నావుగా....
ప్రముఖ కవి గాలీబ్ కూడా నువ్వన్నట్టే అన్నాడు సుమా..
‘ప్రేమను చెరిగిపోయే హరివిల్లు లాంటిది’ అని.
కానీ... నేనది అంగీకరించలేను..
ఎందుకంటే...
నేను ప్రతిరోజూ కొత్తగా ప్రేమిస్తున్నా..
ఆ ప్రేమను సరికొత్తగా వ్యక్తం చేస్తున్నా..
అందుకే.. నా ప్రేమ ఎప్పటికీ నిత్యనూతనం.
మౌనంగా ఆలపించే నవరాగం
ప్రాణంగా ఆలకించే ఆహ్వానం
మా పూదోటలోని పూబాలలంతా నా వాదనే కరెక్ట్ అంటున్నారు తెలుసా
నీ పడమటి పయనం ముగించుకొని వచ్చేనాటికి
రెట్టించిన ప్రేమతో ఆహ్వానం పలికేందుకు
మా వనంలోని పూబాలలందరూ ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నారు మరి.
అసలే పడమటి నుంచి వొస్తున్నావాయె...
సుగంధ పరిమళాలతో నీకు స్వాగతం చెబుతాం..
‘అప్పుడే ఎందుకొంత తొందర’... అంటావా...
ఏం చేయమంటావు చెప్పు...
కనులు మూసినా తెరిచినా  నీరూపమే..
నా శ్వాసలోనూ... ఊహలోనూ నీవే
నా ఆనందంలోనూ...ఆవేదనలోనూ నీవే
నా తనువు.. మనసు అంతా నేవే అయి
అణువణువూ నన్నల్లుకుంటే...
నేనంటూ మిగిలితే కదా..
నువ్వే నేనుగా... ప్రతి జ్ఞాపకంలోనూ నీవుగా
మనసంతా నిండిన ఓ ప్రియ నేస్తమా...
ఈ జీవితం నీకోసం...

నీ జ్ఞాపకలతో...

మూడవ రోజు
27-04-16

మనసు ముడి విప్పనా

స్వప్నాల్లో దృశ్యాదృశ్యంగా నువ్వు..
వెన్నెల సుధలు వసంతగీతాలై పల్లవిస్తుంటే...
ఆ స్వాప్నికానుభూతి అనంతంగానూ,
ఆ తర్వాత అంతా శూన్యంగాను
భ్రమింపజేస్తుంటే...
నీకోసం దాచిన స్వప్న గంధాన్ని ఏం చేయను?
ఎన్నాళ్లని వాటిని మోస్తూ ఈ శూన్య పథాన సంచరించను?
మల్లెలు విరిసే సంధ్యలా నీ ముందు మనసు ముడి విప్పాలనిపిస్తోంది
స్వప్నాలు.. స్వర్గాలు...
ఆకాశపు మృదుత్వం... మనసులోని మమకారం...
మదిలోని సున్నిత సొబగులు నీ దగ్గరే ఉన్నాయనిపిస్తోంది
నేను కోల్పోయిన వసంతాలను
నీ దగ్గర పొందగలనేమోననే అందమైన భావన..
నా హృదయపు శూన్యత నిండా నిండివున్న నువ్వు
ఊహలు... సుందర స్వప్నికలు లేని జీవితం వ్యర్థం కదూ
నా భావుకత అంతా మల్లెతీగలా నిన్ను అల్లుకుపోయింది
నీ ఊహలు నా ఎదలో మల్లెల పరిమళాలు నింపుతున్నాయి
పంచుకునే తోడుంటే మమతలు ఇంత మధురంగా వుంటాయని
నీ ఎదుట మనసు ముడి విప్పిన తర్వాతే తెలిసింది.

- రాజాబాబు కంచర్ల
27-04-2016

26, ఏప్రిల్ 2016, మంగళవారం

రెండవ రోజు

ఓ ప్రియమైన మేఘమాలా..

రాత్రంతా నీ ఆలోచనలే... నిదురే రాని ఈ కనులు స్వప్పించడమూ మానేశాయి.
నీవులేక చిన్నబోయిన మా పూదోటలో శాంతి కరువయ్యింది.
తోటలోని పూబాలలన్నీ మౌనవ్రతం బట్టాయి.
నీ తీయని స్వరం వినబడనిదే గాలిని కూడా పీల్చబోమని మారాం చేశాయి.
వాటిని లాలించి...ఊరడించి.. బుజ్జగించేసరికి వేకువ దాటింది
నా ప్రియమైన మేఘబాలా...
నీవెళ్లిన పడమటిలో గాలుల తీక్షణ, చలి తీవ్రత ఎక్కువగా వుండివుంటుంది. జాగ్రత్త సుమా...
అసలే సుకుమారివి... ఏమాత్రం వత్తిడి తగిలినా వర్షించేస్తావేమో...
ఇంకా ఏమిటి అక్కడి వింతలు, విశేషాలు... విడ్డూరాలు..
పడమటి మేఘాలు నిన్ను ఆదరిస్తున్నాయా...
ఆదరిస్తాయనే అనుకుంటున్నా...
ఎందుకంటే... నీ చాకచక్యం... నీలోవున్న ఆకర్షణ అలాంటిది.
ఎంతటివారైనా.. ఇట్టే స్నేహితులైపోతారు.
కొత్త స్నేహితుల ఆదరణలోపడి మన పూదోటను... ఆ తోటలోని పూబాలలను మరువకేం...
అసలే ఇక్కడి ఎండల తీవ్రతకు పూబాలలు వాడిపోతున్నాయి.
నీవులేని బెంగ కూడా తోడవడంతో మరింత నీరసించిపోతున్నాయి.
అందుకే నీకు మేఘసందేశం కూడా పంపాను.
మాకిక్కడ మధ్యాహ్నం రెండు గంటలైతే... నీకక్కడ తెల్లవారుజాము 4గంటలు.
మృదు మధురంగా.. కోయిల స్వరంలా వుండే నీ గొంతు.. నిద్రమత్తులో భలే హస్కీగావుందిలే.
నీ మాటలు విన్న తర్వాత మన పూదోటలోని పూబాలలన్నీ కాస్త ఉత్సాహం తెచ్చుకున్నాయి..


నీ జ్ఞాపకలతో...

రెండవ రోజు
26-04-16