30, నవంబర్ 2016, బుధవారం

చైతన్యం నింపే కవితా జ్యోతులు

ఈ కవితా సంపుటిలోని ప్రతి అక్షరం అంబేద్కర్‌ భావజాలపు వెలుగులో చైతన్య కిరణం. ఈ కవితా సంపుటి సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షలపై సంధించిన అక్షర తూణీరం. దళితుల ఐక్యత, ఆత్మాభిమానం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం వంటి అంశాలపై కవి హృదయ స్పందనే ఈ కవితా సంపుటి. రచయిత చింతా అప్పారావు ఆంగ్ల భాషా అధ్యాపకులైనప్పటికీ సరళమైన భాషలో వ్యవస్థలోని లొసుగుల ముసుగుల్ని తొలగించి, వ్యవస్థ స్వరూపాన్ని, ఆయా వర్గాల భావోద్వేగాలను స్పష్టంగా, నిర్మొహమాటంగా వెల్లడించారు. 'చైతన్య జ్యోతులు' అనే
ఈ పుస్తకంలో 114 పేజీలో 60 కవితలతో పాటు కొన్ని వ్యాసాలు, పరిచయ వాక్యాలను పొందుపరిచారు. ఈ మొత్తం కవితల్లో సమకాలీన పోకడలకు అద్దంపట్టే లోతైన పరిశీలన కనిపిస్తుంది. ఇది రచయిత ఆలోచనలకు, భావాలకు నిలువుటద్దం అని చెప్పొచ్చు.
'ఊరేదైనా కన్నీరు ఒక్కటే' కవితలో... మానవత్వానికి కులం లేదనే సందేశాన్నిస్తే.. 'పేదల బతుకు' కవితలో... పేదల బతుకు- ఉడకని మెతుకు/ తింటే అజీర్ణం - తినకుంటే మృత్యువర్ణం... అంటూ ఇది మారాలంటే 'కులం లేని జాతీయ నేత, మతంలేని ప్రవక్త మనల్ని పాలించాల'ంటూ తన మనసులోని భావాల్ని స్పష్టం చేస్తారు. 'నీవులేక మేము లేము' కవితలో... మట్టి తట్టలు మోసిన బిడ్డలను/ మట్టిలో మాణిక్యాలుగా మలిచినావు' అంటూ అంబేద్కర్‌ గొప్పదనాన్ని విశ్లేషిస్తారు కవి.
'నత్త మా మేనత్త' కవితలో... 'నత్త తన మీద గూటిని మోసుకెళతది... కులం కుంపటి మా నెత్తిన మోయాల్సి వస్తోంది' అంటూ... వ్యంగ్యోక్తులు విసిరినా, ఎక్కడికెళ్లినా నత్త గూడులా కుల శిరోభారం మమ్ము వెంటాడుతోందంటూ ఒకింత ఆవేదననూ వ్యక్తం చేస్తాడు రచయిత. 'కులమే ఒక విచిత్ర గణిత శాస్త్రం' కవితలో... 'మన దేశంలో కులమే ఒక విచిత్ర గణిత శాస్త్రం/ కులమే ఒక కూడిక, ఒక తీసివేత, ఒక వెలివేత' అంటూ... కులం లెక్కలను... మనువు రాతలను... దళితులు అనుభవిస్తున్న వెలివేతలను, తీసివేతలను తూర్పారబడుతూ, 'కులమే ఒక పెంట కుప్పయితే, స్వచ్ఛభారత్‌ ఎలా సాధ్యం? అంటూ... ఆధునిక సమాజాన్ని నిగ్గదీస్తాడు రచయిత.
ఈ కవితా సంపుటిలోని చాలా కవితలు అంబేద్కరిజాన్ని ప్రతిబింబిస్తాయి. కులం, మతం, అణచివేతలతో పాటు ప్రపంచీకరణ ప్రభావంతో బహుజనులు ఎదుర్కొంటున్న ప్రతి అంశాన్ని స్పృశించారు. వీటన్నింటి నుంచి విముక్తికి అంబేద్కర్‌ భావజాలం మాత్రమే ఏకైక మార్గమని, నేటి యువతరానికి ఫూలే, అంబేద్కర్‌ భావజాలాన్ని అందించాలనే సంకల్పమే ఈ చిన్న ప్రయత్నమని చెబుతూ... 'నా కవితలు అందమైన అమరావతి శిల్పాలు కాకపోవచ్చు.... కానీ ఆలోచింపచేసేందుకు అక్షర రూపం దాల్చిన చైతన్య జ్యోతులు' అని రచయిత చెప్పుకుంటారు.
చివరిగా ఈ కవితల్లో రచయిత తాను చెప్పదల్చుకున్న భావానికే ప్రాధాన్యతనిచ్చారు తప్ప... శైలిని, పదాల కూర్పును ఒదిలేశారు. ఈ జాగ్రత్త కూడా తీసుకొనివుంటే ఈ కవితలకు మరింత వన్నె వచ్చేదని చెప్పవచ్చు.
- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి