30, ఏప్రిల్ 2016, శనివారం

అయిదవ రోజు



ప్రియమైన నీలి మేఘమా...

కాసేపు నీతో మాట్లాడాలని వుంది.
రోజంతా నీ మాట వినక..
నిస్తేజం అయిపోయింది మనసు.
ఇలావచ్చి గుండెలపై వాలిపోవా..
నిలువెల్లా ప్రేమను వర్షించే నీ కళ్లలోకి
అలా చూస్తుండిపోనివ్వవా
ఈ ప్రపంచంతో సంబంధంలేనంతగా...
ఊహల ఊపిరిలో ఇలా ఎంతకాలం బతకమంటావు
తొలిసారి చూసినపుడే కల నిజం చేసుకున్నా
నీ చివురు పెదవి తాకి ఎద సొదలను విన్నా
ఆ అధరాల తాకిడితో అమరత్వాన్ని నింపవా
ఓ నీలిమేఘమా...
ఈ ఎడబాటు తాత్కాలికమే అయినా భరించలేనిది.
ఊరుకాని ఊరులో
దేశంకాని దేశంలో
ఎలా వుంటున్నావో
ఏం చేస్తున్నావో
బెంగగా వుంది...
కలగా మిగిలిపోతుందనుకున్న
నా జీవితంలోకి వెలుగై వచ్చిన
నా మనసులోని మనసా...
జోల పాడటానికి రానా
నిలువెల్లా నిను ముద్దులతో ముంచెయ్యనా...

నీ జ్ఞాపకాలతో...

అయిదవ రోజు
29- 04-2016

నీ నవ్వుల్లో నే జీవిస్తున్నా

జీవన గమనం
హృదయాన్ని బరువెక్కించిన వేళ
మాటలెరిగిన మనసు
మౌనం దాల్చిన వేళ
సంధ్య వెలుగులు
తన జ్ఞాపకాలను ప్రోదిచేస్తున్న వేళ
కనుల ముందున్న రూపం
రెప్పవెనుక స్వప్నంలా మారుతున్న వేళ

వెన్నెల  జలపాతంలా
తొలి పొద్దుపొడుపులా
వలపుల హరివిల్లులా
నన్నావహించావు ఆత్మలా

నీ నవ్వుల్లో నే జీవిస్తున్నా
నీ మాట్లల్లో  నన్నే చూస్తున్నా
కంటిపాపలో వెలుగై నిలుచున్నా..
నీ శ్వాసనే నా ఊపిరిగా మార్చుకున్నా
ఎంత దూరాన నీవున్నా
నీతోనే నేవున్నా

- రాజాబాబు కంచర్ల
30-04-2016

28, ఏప్రిల్ 2016, గురువారం

నువ్వూనేను... ఒకటి

కటి ఒకటి కలిస్తే...రెండు
నువ్వూ నేను కలిస్తే... ఒకటి
ప్రకృతిలో ఒకటయ్యే ప్రతి రెండూ
తిరిగి ఒక్కటవుతాయి...
మలయమారుతమై పలకరిస్తావా
నీలి మేఘమై వర్షిస్తా...
అవనివై నను స్వీకరిస్తావా
తొలకరి మొలకై పులకరిస్తా
అలవై ఎగసిపడతావా
చెలియల కట్ట నేనవుతా..
రాగం నీవయితే
తానం నేనై పల్లవిస్తా
మయూరంలా నర్తిస్తావా
కాలి అందియనై రవళిస్తా
కావ్యనాయిక నీవైతే
నిను వర్ణించే ప్రతి అక్షరం నేనవనా..
పూబాల నీవైతే..మధుపం నేనవనా..
మల్లియ నీవైతే.. సౌరభం నేనవనా
హేమంత తుషారం నీవైతే...
వడిసి పట్టుకొనే గరికను నేనవనా
జాబిలమ్మ నీవైతే...
వెన్నెల వాసంతం నేనవనా..
మది నిండిన నీరూపం ఎప్పటికీ సజీవ దృశ్యం
నీపై నా ప్రేమ ఎప్పటికీ చెలిమెల ప్రవాహం
నిన్నటి కన్నా నేడు
నేటి కన్నా రేపు
పెరుగుతుండేదే నా ప్రేమ
అది పిల్ల తెమ్మెరలా స్పృశిస్తుంది
మల్లెతీగలా అల్లుకుంటుంది
చెలికాని కౌగిలిలో సేదతీరుతుంది
రెండుగా కనిపించినా వాటి ఆత్మలు ఒక్కటే
ఎప్పటికీ నువ్వూ...నేను ఒక్కటే

- రాజాబాబు కంచర్ల
29-04-2016

నాల్గవ రోజు

ప్రియమైన మేఘమాల....
ఎక్కువమంది జీవితంలో సంతోషం కొన్ని ఘడియల అతిథి మాత్రమే.
విచారం మాత్రం చాలాదూరం మనతో చాలా దూరం వరకూ తోడుగా వస్తుంది.
విచారాన్ని మరపించి... సంతోషంతో చెలిమి చేయించిన నీవంటే
మా పూదోటలోని ప్రతి కుసుమానికి ఎంతో అభిమానం.
నీలి మేఘమా...
నీవు నా తోటకు వచ్చిన రోజు మా జీవితంలో శరత్ జ్యోత్స్నలు కురిసిన రోజు.
నీ మనసులో స్థానమిచ్చి అనురాగం కురిపించిన రోజు.
వడలిన తీగెకు ప్రాణమిచ్చి, ఆత్మవిశ్వాసం పెంచి, వేళ్లూనుకునేలా చేసిన రోజు...
అందుకే...
నీ పట్ల అంత మమకారం పెంచుకున్నాము.
ఈ రుతువు అన్నిరోజులు హాయిగా గడిపి
నూతనోత్సాహంతో ఈ దేశానికి తరలిరావా...
అందాకా... నీ సందేశం మాకు అందుతూ వుంటే
ఎంతో ఉత్తేజం నిండుతుంది మా మదిలో
ఆ ఉత్తేజంతోనే నీవొచ్చే వరకూ
క్షణాలు యుగాలుగా తడబడుతుంటే...
నిస్సత్తువగా చూస్తుండడం మినహా ఏం చేయలేక...
నీకోసం ఎదురుచూస్తూ...

నీ జ్ఞాపకాలతో...

నాల్గవ రోజు
28- 04-2016

27, ఏప్రిల్ 2016, బుధవారం

మూడవ రోజు

ఓ ప్రియమైన మేఘమాలా...

 ఎలావున్నావు... నీ మాటలు కాసింత ఊరటనిచ్చింది తెలుసా...
ఏమిటో ఈ పచ్చి రోజురోజుకూ...
కొద్దిరోజులుంటే ఇప్పుడున్నంత గాఢత వుండన్నావుగా....
ప్రముఖ కవి గాలీబ్ కూడా నువ్వన్నట్టే అన్నాడు సుమా..
‘ప్రేమను చెరిగిపోయే హరివిల్లు లాంటిది’ అని.
కానీ... నేనది అంగీకరించలేను..
ఎందుకంటే...
నేను ప్రతిరోజూ కొత్తగా ప్రేమిస్తున్నా..
ఆ ప్రేమను సరికొత్తగా వ్యక్తం చేస్తున్నా..
అందుకే.. నా ప్రేమ ఎప్పటికీ నిత్యనూతనం.
మౌనంగా ఆలపించే నవరాగం
ప్రాణంగా ఆలకించే ఆహ్వానం
మా పూదోటలోని పూబాలలంతా నా వాదనే కరెక్ట్ అంటున్నారు తెలుసా
నీ పడమటి పయనం ముగించుకొని వచ్చేనాటికి
రెట్టించిన ప్రేమతో ఆహ్వానం పలికేందుకు
మా వనంలోని పూబాలలందరూ ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నారు మరి.
అసలే పడమటి నుంచి వొస్తున్నావాయె...
సుగంధ పరిమళాలతో నీకు స్వాగతం చెబుతాం..
‘అప్పుడే ఎందుకొంత తొందర’... అంటావా...
ఏం చేయమంటావు చెప్పు...
కనులు మూసినా తెరిచినా  నీరూపమే..
నా శ్వాసలోనూ... ఊహలోనూ నీవే
నా ఆనందంలోనూ...ఆవేదనలోనూ నీవే
నా తనువు.. మనసు అంతా నేవే అయి
అణువణువూ నన్నల్లుకుంటే...
నేనంటూ మిగిలితే కదా..
నువ్వే నేనుగా... ప్రతి జ్ఞాపకంలోనూ నీవుగా
మనసంతా నిండిన ఓ ప్రియ నేస్తమా...
ఈ జీవితం నీకోసం...

నీ జ్ఞాపకలతో...

మూడవ రోజు
27-04-16

మనసు ముడి విప్పనా

స్వప్నాల్లో దృశ్యాదృశ్యంగా నువ్వు..
వెన్నెల సుధలు వసంతగీతాలై పల్లవిస్తుంటే...
ఆ స్వాప్నికానుభూతి అనంతంగానూ,
ఆ తర్వాత అంతా శూన్యంగాను
భ్రమింపజేస్తుంటే...
నీకోసం దాచిన స్వప్న గంధాన్ని ఏం చేయను?
ఎన్నాళ్లని వాటిని మోస్తూ ఈ శూన్య పథాన సంచరించను?
మల్లెలు విరిసే సంధ్యలా నీ ముందు మనసు ముడి విప్పాలనిపిస్తోంది
స్వప్నాలు.. స్వర్గాలు...
ఆకాశపు మృదుత్వం... మనసులోని మమకారం...
మదిలోని సున్నిత సొబగులు నీ దగ్గరే ఉన్నాయనిపిస్తోంది
నేను కోల్పోయిన వసంతాలను
నీ దగ్గర పొందగలనేమోననే అందమైన భావన..
నా హృదయపు శూన్యత నిండా నిండివున్న నువ్వు
ఊహలు... సుందర స్వప్నికలు లేని జీవితం వ్యర్థం కదూ
నా భావుకత అంతా మల్లెతీగలా నిన్ను అల్లుకుపోయింది
నీ ఊహలు నా ఎదలో మల్లెల పరిమళాలు నింపుతున్నాయి
పంచుకునే తోడుంటే మమతలు ఇంత మధురంగా వుంటాయని
నీ ఎదుట మనసు ముడి విప్పిన తర్వాతే తెలిసింది.

- రాజాబాబు కంచర్ల
27-04-2016

26, ఏప్రిల్ 2016, మంగళవారం

రెండవ రోజు

ఓ ప్రియమైన మేఘమాలా..

రాత్రంతా నీ ఆలోచనలే... నిదురే రాని ఈ కనులు స్వప్పించడమూ మానేశాయి.
నీవులేక చిన్నబోయిన మా పూదోటలో శాంతి కరువయ్యింది.
తోటలోని పూబాలలన్నీ మౌనవ్రతం బట్టాయి.
నీ తీయని స్వరం వినబడనిదే గాలిని కూడా పీల్చబోమని మారాం చేశాయి.
వాటిని లాలించి...ఊరడించి.. బుజ్జగించేసరికి వేకువ దాటింది
నా ప్రియమైన మేఘబాలా...
నీవెళ్లిన పడమటిలో గాలుల తీక్షణ, చలి తీవ్రత ఎక్కువగా వుండివుంటుంది. జాగ్రత్త సుమా...
అసలే సుకుమారివి... ఏమాత్రం వత్తిడి తగిలినా వర్షించేస్తావేమో...
ఇంకా ఏమిటి అక్కడి వింతలు, విశేషాలు... విడ్డూరాలు..
పడమటి మేఘాలు నిన్ను ఆదరిస్తున్నాయా...
ఆదరిస్తాయనే అనుకుంటున్నా...
ఎందుకంటే... నీ చాకచక్యం... నీలోవున్న ఆకర్షణ అలాంటిది.
ఎంతటివారైనా.. ఇట్టే స్నేహితులైపోతారు.
కొత్త స్నేహితుల ఆదరణలోపడి మన పూదోటను... ఆ తోటలోని పూబాలలను మరువకేం...
అసలే ఇక్కడి ఎండల తీవ్రతకు పూబాలలు వాడిపోతున్నాయి.
నీవులేని బెంగ కూడా తోడవడంతో మరింత నీరసించిపోతున్నాయి.
అందుకే నీకు మేఘసందేశం కూడా పంపాను.
మాకిక్కడ మధ్యాహ్నం రెండు గంటలైతే... నీకక్కడ తెల్లవారుజాము 4గంటలు.
మృదు మధురంగా.. కోయిల స్వరంలా వుండే నీ గొంతు.. నిద్రమత్తులో భలే హస్కీగావుందిలే.
నీ మాటలు విన్న తర్వాత మన పూదోటలోని పూబాలలన్నీ కాస్త ఉత్సాహం తెచ్చుకున్నాయి..


నీ జ్ఞాపకలతో...

రెండవ రోజు
26-04-16

నేనే నువ్వయిపోతున్నా...

స్వప్నమో, సౌందర్య దాహమో తెలియదు
నువ్వో అద్భుతానివని మాత్రం తెలుసు
అందంతో మనసును ముంచెత్తుతావు
మోడువారిన మనసును చిగురింపజేస్తావు

నీ జ్ఞాపకాలు నిదురను దూరం చేస్తోంటే..
స్వప్నించలేని కనులను ప్రతిరాత్రీ వెక్కిరిస్తోంది
జ్ఞాపకాల అలజడితో తెల్లారిపోతోంటే...
ఋతువులను మరచిన వియోగిలా నీ ధ్యానంలోనే

మళ్లీ నువ్వొచ్చే వరకూ..
నీ జ్ఞాపకాల చిట్టాలను నెమరువేస్తూ
నీ వియోగాన్ని ఓర్చుకోలేని వెన్నెలరాత్రులు
ఒంటరి నక్షత్రంలా  నే మిగిలిపోతున్నా

నీ భావాలను అనువదించే కొద్దీ..
సరికొత్తగా ఆవిష్కృతమౌతోన్న నువ్వు
గమ్యంలేని నా భావాలను
పునర్నిర్మించుకుంటూ నేను...

నాలోకి ఆవాహనం చేసుకుంటూ..నేనే నువ్వయిపోతున్నా
నీ ప్రేమైక రూపం చెలిమెగా..ఆమని కోయిలగా
మళ్లీ కొత్తగా పుట్టుకొస్తుంటే..
నుదుట సిందూరమై మురిసిపోనా

- రాజాబాబు కంచర్ల

26-04-2016

25, ఏప్రిల్ 2016, సోమవారం

తొలిరోజు


ఓ ప్రియమైన మేఘమాలా...

     నిత్యం మా వనంలో సంచరించే నువ్వు.
ఏ వైపునుంచి చూసినా ఎంత అందంగా కనబడేదానవో.
రుతువుల్లో వచ్చిన మార్పు మనని దూరం చేసింది...
నీవు పశ్చిమ దిశగా పూలతేరుపై నీ పయనం సాగించావు.
నీవు మోసుకొచ్చే పిల్లతెమ్మెరలు.. మలయమారుతాలు జాడలేక మా వనం బోసిపోయింది.
నీ మృదుమధురమైన స్వరంతో,  ప్రేమతో మాట్లాడే నీ మాటలు దూరమై... మా వనంలోని పూబాలలు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాయి.
ఏ స్వప్నమో... ఏ సౌందర్య దాహమో తెలియదు...
మా వనంలో నుంచి నిన్ను చూస్తుంటే మనసు పరవశించేది..
గుండె లయ తప్పేది...
తనువు అదుపు తప్పేది.
ఎంతో అందమైన ఈ పూదోట... నీవులేని ఈ నిమిషం కీకారణ్యాన్ని తలపిస్తోంది.
ఓ మేఘబాల...
పశ్చిమం నుంచి నువ్వొచ్చే వరకు విరహంతో వేగిపోతుంటాయేమో...
నువ్వొచ్చీ రాగానే రుతువులు మారతాయి...
వర్షిస్తాయి..
మళ్లీ మా వనం చిగుళ్లు వేస్తుంది...
విరబూస్తుంది...
ప్రేమసుమాలు వెదజల్లుతుంది.
అప్పటివరకూ ఎదురుచూస్తూ...

నీ జ్ఞాపకలతో...
తొలిరోజు
25-04-16

స్ఫూర్తి శిఖరం












 ఎదలోని స్పందన తానని
అలసటలోని ఓదార్పు తానని
వేదనలోని లాలన తానని
కోవెలలోని దేవర తానని
మనసులోని మాట
నీవైనా చెప్పవే ఓ మేఘమాల

శరత్తులోని వెన్నెల తానని
వెన్నెలలోని చల్లదనం తానని
మల్లెలలోని మాధుర్యం తానని
పూవులోని తేనీయ తానని
మనసులోని మాట
నీవైనా చెప్పవే ఓ మేఘమాల

తానులేక నేను లేనని
నా ప్రతి అణువులోనూ నిండివున్నదని
నా స్ఫూర్తి శిఖరం తానేనని
జన్మజన్మల బంధం తానేనని
మనసులోని మాట
నీవైనా చెప్పవే ఓ మేఘమాల

- రాజాబాబు కంచర్ల
25-04-2016

23, ఏప్రిల్ 2016, శనివారం

చెప్పవే చిరుగాలి...

















మల్లెలోని తెల్లదనం
తన మనసులోనే చూసానని
ఆ మనుసులోని మంచితనం
తన కనులలోనే చూశానని
అందానికి అనురాగానికి అవధులు
తనలోనే చూశానని
చెప్పవే చిరుగాలి...  నా చెలియతో

నాజూకు నాసికపై
జాబిలి చంద్రికను నేనై మెరవాలని
తన ఎదపై హొయలుపోయే కంఠహారం
నేనై పరవశించాలని
పసిడి వర్ణ చరణాలపై
పుట్టుమచ్చ నేనై మురవాలని
చెప్పవే చిరుగాలి...  నా చెలియతో

- రాజాబాబు కంచర్ల
24-04-2016

నిశ్శబ్దాన్ని తరిమేద్దామా...













ఉన్న హృదయం ఒక్కటే
కానీ బాధలు మట్టుకు రెండు
నీవు లేవనే బాధ ఒక్కటి
ఎప్పటికి చూస్తానోననేది మరొక్కటి

ఎవరైనా బాధను ఆమెకు చెబితే...
కానీ ఎవ్వరు మాత్రం చెప్పగలరు
నా చుట్టూ గూడుకడుతున్న నిశ్శబ్దాన్ని చూసి
నాలో నేనే నవ్వుకోవడం తప్పా..

నేను చెప్పాలనుకున్నవన్నీ నీకూ
నీవు చెప్పలేనివన్నీ నాకు
వివరించగలదెవ్వరు.. అందుకే..
మనసువిప్పి పంచుకుందామా.
నిశ్శబ్దాన్ని తరిమేద్దామా..

- రాజాబాబు కంచర్ల
23-04-2016

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఓ మేఘమాలిక















ఓ మేఘమాలికా.. చెప్పవే ఓ మాట నా చెలియతో
వేరెవ్వరూ లేని వేళలో

శశిలేని రాతిరిలా నేనున్నానని..
జతలేని ఒంటి గువ్వలా నే మిగిలానని
ఓ మేఘమాలికా... చెప్పవే ఓ మాట నా చెలియతో

పగలంతా నీ తలపులతో నే గడిపేస్తున్నాఅని
రేయంతా నీ స్వప్పాలలో నే తేలిపోతున్నా అని
ఓ మేఘమాలికా... చెప్పవే ఓ మాట నా చెలియతో

మల్లెలోని తెల్లదనం తన మనసులో నే చూశానని
ఆ మనసులోని మంచితనం తన కనులలో నే చూశానని
ఓ మేఘమాలికా... చెప్పవే ఓ మాట నా చెలియతో

- రాజాబాబు కంచర్ల
22-04-2016

21, ఏప్రిల్ 2016, గురువారం

మౌన స్వరాలు














ఉషస్సులు...ఉగాదులు లేని
నాదైన చిన్ని ప్రపంచంలోకి
మలయమారుతంలా వచ్చావెందుకు..!

మనసులోని ఆశలు
మరుగునపడిన శిశిరవేళలో
నా అంతరంగంలోకి తొంగిచూసావెందుకు..!

మనసు పొరల్లో నిక్షిప్తమైవున్న
ప్రేమైక జీవనాన్ని మేల్కొలిపి
జ్ఞాపకాల తడిని తడిమావెందుకు..!

మది కోవెలలో కొలువైన
అస్పష్ట రూపాన్ని స్పృశించి
హృదయవీణా తంత్రులను మీటావెందుకు..!

మౌన స్వరాలను పలికించి
మది వీణియను మ్రోగించి
మధ్యలోనే నిలిపేశావెందుకు..!

- రాజాబాబు కంచర్ల
21-04-2016

19, ఏప్రిల్ 2016, మంగళవారం

నను మరువకుమా!












పశ్చిమానికి
పయనమైన ఓ మేఘమా!
మనసును ముడివేసిన
ప్రేమ బంధమా..!
వలపులు రగిలించిన
తీయని విరహమా!
ఎన్నో అనుభూతులను మిగిల్చిన
జ్ఞాపకాల హారమా!
జన్మజన్మలకు
వీడిపోని బంధమా!
నా మనసెరిగిన
స్నేహ సుమగంధమా!
నా ప్రియ నేస్తమా!
నను మరువకుమా!

- రాజాబాబు కంచర్ల
20-04-2016

17, ఏప్రిల్ 2016, ఆదివారం

స్వప్నించే నా కనుల సాక్షిగా...



















ఈ గాలి.... నీరు... భూమి.... ఆకాశం...
ఈ ప్రకృతి....
మూగగా స్వప్నించే నా కనుల సాక్షిగా...
ప్రభాతం ప్రకృతి ముంగిట
రంగవల్లులద్దిన వేళ నుండి...
సాయం సంధ్య
నుదుట సిందూరం దిద్దే వరకూ...
స్మృతి సితారలు మీటుతూ...
మది నిండా నీ రూపమే....
నాకొక అర్థంకాని పదమై
నా మెదడు నిఘంటువును కలవరపెడతావు
తెరలు తెరలుగా ఎగసిపడే అనుభూతి కెరటాలు
ఎద ఒడ్డును తాకి తాకి వెళుతుంటే....
నా మనసు పడే ఆరాటం చెప్పడానికి
అక్షరాలు కరువవుతున్నాయి..
అందుకే...
నా మనసు పుస్తకాన్ని
నీ చెవిలో వినిపిస్తా...
నా స్వప్నపు పుష్పాన్ని
నీ చరణాల ముందు పరుస్తా...
పిచ్చివాణ్ణనుకుంటే పట్టించుకోకు...
ఆరాధకుణ్ణనుకుంటే...
స్పందించూ...
నా ప్రేమను గుర్తించూ....
చాలు బంగారం...
ఈ జన్మకది చాలు...

- రాజాబాబు కంచర్ల
18-04-2016

16, ఏప్రిల్ 2016, శనివారం

నివేదన













జీవితం యాంత్రికమైన వేళలో
కాలం కడలిలో నన్ను నేనే కోల్పోతున్నప్పుడు
నా అంతరంగ పొరల్లో నిక్షిప్తమైన
అగాధాన్ని ప్రేమతో నింపింది  నువ్వు

నిర్నిద్ర రేయిలలో... హృదయ పరితాపాలతో
రెప్పమాటు తడి ఆవిరవుతున్నప్పుడు
వెన్నెల వెలుగులు నింపింది
స్వప్నాల జాడ అయ్యింది నువ్వు

భరింపరాని ఏకాంతాన్ని భారంగా  మోస్తున్న వేళలో
వాసంత సమీరంలా  తాకిన నీ స్నేహంతో
నిద్రాణమైన మనసును మేల్కొలిపి
ఎద వీణియను శృతి చేసింది నువ్వు

మనసును రంజింపజేసే వెన్నెల వాహినిలో
ప్రేమజ్యోతిని వెలిగించె నీ మమతల మాధుర్యంతో
మదినిండిన ఆశల దీపానికి ఆయువు నింపి
మరో ఉదయానికి దారిచూపింది నువ్వు

రంగుల హరివిల్లయిన ఈ సరికొత్త ఉషోదయాన్ని
పల్లవించవా నా గొంతులో... వసంతగానమై
రవళించవా నా బతుకులో... ప్రణయనాదమై
ఆలకించవా నా నివేదన.. ప్రియ నెచ్చెలివై

- రాజాబాబు కంచర్ల
17-04-2016

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

మళ్లీ నువ్వొచ్చే వరకూ


















నీ సుందర రూపాన్ని
కనుల నిండుగా చూసుకోనీ..
గుండెల నిండుగా నింపుకోనీ..

మళ్లీ నువ్వొచ్చే వరకూ
కనుల నిండిన నీ రూపాన్ని చూసుకుంటూ
జ్జాపకాలతో సావాసం చేయనీ..
గుండెల నిండిన నీ ప్రేమను తలచుకుంటూ
నీ తలపులతో  బతకనీ...
నువు చెప్పిన ఊసులను మననం చేసుకుంటూ
నీ ప్రేమను కవితలుగా లిఖించనీ...

మళ్లీ నువ్వొచ్చే వరకూ
నా ప్రేమను మరింత బలపరుచుకోనీ...
ప్రేమంటే కలిసుండటమే కాదనీ..
దూరాన్నికూడా దగ్గరగా అనుభవించడమనీ
నన్ను రుజువు చేసుకోనీ...
నీ హృదిలో చెరగని ముద్రగా నను నిలువనీ
ఎన్నటికీ వీడని బంధమై  పెనవేయనీ..

- రాజాబాబు కంచర్ల
15-04-2016

14, ఏప్రిల్ 2016, గురువారం

పండు వెన్నెల్లో నువ్వూ..నేను..


















పండు వెన్నెల్లో
సముద్రం ఒడ్డున
నువ్వూ..నేను..

ఒక్కటొక్కటిగా వచ్చే అలలు
పాదాలను తాకి అల్లరి పెడుతుంటే..
ఏ దూర తీరం నుంచో
వచ్చిన పిల్లగాలి
సున్నితంగా తాకి వెళుతుంటే..
ఏకాంతంలో
నువ్వూ..నేను..

వెన్నెల వేడి
అలల అల్లరి
పిల్లగాలి గిలిగింత
మనసులను పరవశింప జేస్తోంటే..
అధరములు నాల్గు ఒక్కటై
హృదయాలు రెండు ఏకమై
తనువులు రెండు చేరువై
పండు వెన్నెల్లో
సముద్రం ఒడ్డున
నువ్వూ..నేను..

- రాజాబాబు కంచర్ల
14-04-2016

13, ఏప్రిల్ 2016, బుధవారం

అంబేద్కర్ 125వ జయంతి



















కాదు...కాదు..
దేశాభివృద్ధి అంటే
అద్దాల మేడలు
రంగురంగుల గోడలు

బానిసత్వాన్ని పోగొట్టుకోవాలంటే
దేవునిమీదో
మరెవరిమీదో ఆధారపడొద్దు
నీ బానిసత్వాన్ని
నువ్వే పోగొట్టు..
నీ చుట్టు నిర్మించబడిన
కుల కంచు గోడలను
నువ్వే బద్దలుకొట్టు..

కుల పునాదులపై
ఒక జాతిని, నీతిని
నిర్మించలేమని చాటిచెప్పు..

మనసుపడిన అధరాలు













పసుపు వర్ణ శోభిత సుందర చరణములు
చుంబించ మనసాయె అధరములకు
తాకినంత కందిపోయే సుకుమార పద్మములు
కందకుండునా కరకు పెదవుల చుంబనమునకు

ఆ స్పర్శ గుర్తు తెచ్చె తొలినాటి గిలిగింత
అందుకేనేమో ఏదో తెలియని పులకింత
అది మరపురాని సాయంత్రం
మరువలేని తీయని జ్ఞాపకం

- రాజాబాబు కంచర్ల
13-04-2016

12, ఏప్రిల్ 2016, మంగళవారం

వసంతమై నిన్నల్లుకుంటా

మధువులోని మాధుర్యం నీ మాటల్లో
జాబిలిలోని నిర్మలత్వం నీ నవ్వుల్లో
వెన్నెల్లోని చల్లదనం నీ జతలో
ఉషోదయపు వెచ్చదనం నీ ఒడిలో
ప్రకృతిలోని పరిమళం నీ పరిచయంలో
మూర్తీభవించిన మనిషితనం నీ వ్యక్తత్వంలో
అందుకే నేస్తం..
నన్ను నిన్నుగా మలుచుకుంటూ
నీరూపం నాదిగా సరికొత్త రంగులు అద్దుకుంటూ
నీకోసం వస్తున్నా.. వసంతమై నిన్నల్లుకుంటా

                                                                                             - రాజాబాబు కంచర్ల

మనసున్న మనుషుల మానసిక సంఘర్షణే ''స్ఫూర్తి''

మధ్యతరగతి కుటుంబ జీవనం చుట్టూ నడిచిన కథ ఈ నవల. కథ పాతదే అయినా నడిపించిన తీరు కొత్తగాను, ఆసక్తికరంగానూ వుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మనసున్న మనుషుల మానసిక సంఘర్షణ. అంతేకాకుండా రచయిత్రి తంబళ్లపల్లి రమాదేవి 'స్ఫూర్తి' నవలలో భార్యాభర్తల వ్యక్తిగత జీవితంలోని అన్ని కోణాలనూ చిత్రించారు. రమాదేవికి ఇది రెండవ నవల. ఇంతకుముందు 'మధులిక' అనే నవలను రచించారు.
పెట్టుబడిదారీ వ్యవస్థలో వస్తున్న మార్పులు ఉమ్మడి కుటుంబాలపైన, కుటుంబ జీవనంపైనా ఎలాంటి ప్రభావం చూపుతుంది, తెచ్చిపెట్టుకున్న ఆధునిక పోకడల వల్ల కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతాయో రచయిత్రి చక్కగా వివరించారు. ముఖ్యంగా ఈ నవలలో కీలకమైన మూడు పాత్రలూ మహిళలే కావడం విశేషం. ఒకరు తెచ్చిపెట్టుకున్న ఆధునికతతో డాంబికాలు ప్రదర్శించే అత్తగారు. ఎంతసేపూ ఎదుటివారిలో తప్పొప్పులు వెదికి,

అక్షర తూణీరాలు.. గణపతిరావు కథలు

గణపతిరావు రచన చేసిన 'ఆకుపచ్చ అంటుకుంది' కథాసంకలనంలోని అన్ని కథలు సమాజంపై సంధించిన అక్షర తూణీరాలే. రచయిత సామాజిక దృక్పథమే ఈ రచనకు బలం చేకూర్చింది. సమకాలీన స్థితిగతులపై పదాల తూటాలను పేల్చుతూ.. కథను చెప్పడంలో తనదైన ఒక ప్రత్యేక శైలిని రచయిత అనుసరించారు. కథలకు పెట్టిన శీర్షికలు కూడా అర్థవంతంగా, ఆకర్షణీయంగా, ఆలోచనాత్మకంగా వున్నాయి. పుస్తకం ముఖచిత్రం నుంచి, ప్రతి కథనూ ప్రారంభించిన తీరు, ఆయా కథలకు వేసిన చిత్రాల వరకూ కథా సంకలనం యొక్క ప్రత్యేకతను చాటుతాయి.
'ప్రకృతిని కాపాడలేనివారికి జీవించే హక్కులేదు' అంటూ 'ఆకుపచ్చ అంటుకుంది' కథలో ఒక కాకితో చెప్పిస్తాడు రచయిత. ఈ కథ చదివితుంటే... అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు చేస్తోన్న ప్రకృతి విధ్వంసం గుర్తుకురాక మానదు. ఇలాంటిదే 'ఆకులు కాలాక చేతులు' కథ. కొమ్మలు, రెమ్మలు, ఆకులతో కళకళలాడే చెట్టు.. ఆ కొమ్మలు విరిగి,

సమాజంలోని అవకతవకలపై కళాత్మక విశ్లేషణ... ''కడుపుకోత'' కథాసంపుటి

తెలంగాణా మాండలికంలో వచ్చిన తొలి కథా సంపుటి 'కడుపుకోత'. ఈ సంపుటి కడుపుకోత కథతోనే ప్రారంభం అయింది. తెలంగాణా మాండలికం మీద మంచి పట్టున్న దేవరాజు మహారాజు రచించిన ఈ కథాసంపుటిలో పది కథలున్నాయి. ఈ పది కథల్లోనూ వారు ఎంచుకున్న కథా వస్తువు ప్రజాజీవనానికి సంబంధించిదే. నిత్యజీవితంలో మనం రోజూ చేసే సంఘటనలను వారు చక్కని కథలుగా మలిచిన వైనం చదువరులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.

సమాజాన్ని పరిచయం చేసే కథలు... 'చింతా దీక్షితులు సాహిత్యం-2'

తెలుగు కథా సాహిత్యంలో తొలితరం కథకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు. తెలుగు కథ నడకలు నేర్చుకుని సరైన మార్గంలో పయనించడానికి బాటలువేసిన ముఖ్యుల్లో దీక్షితులు ఒకరు. భాషలో, శిల్పంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న కథకుడు. ఆయన రచించిన కథలను ఏకాదశి కథలు, దాసరిపాట, హాస్యకథలు, మిసెస్‌ వటీరావు కథలు అని నాలుగు భాగాలుగా వర్గీకరించి 'చింతా దీక్షితులు సాహిత్యం-2' పేరుతో ఈ సంకలనం ప్రచురించారు. ఈ నాలుగు విభాగాల్లోనూ మొత్తం 42 కథలున్నాయి. ఏకాదశి కథల్లో 'శ్యామల' కథలో కథానాయకుడు శ్రీధరరావు బ్రహ్మచారి. ఆయన ప్రేమించిన శ్యామల జబ్బు చేసి మరణించడంతో ఒంటరిగా మిగిలిపోయాడు. హాస్యకథలు విభాగంలో డబ్బు డబ్బు డబ్బు, ముడు కుక్కలు ముఖ్యమైనది.

వాస్తవ ఘటనలే కథావస్తువుగా... 'శిశిరవేళ'

సమాజంలోని వాస్తవ ఘటనలను కథలుగా, నవలలుగా మలచడంలో విశేషానుభవం గడించిన ప్రముఖ రచయిత పెద్దిభట్ల సుబ్బరామయ్య గారి వాస్తవ ఘటనల సమాహారం.. ఈ కథల సంపుటం. 2012 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న పెద్దిభట్ల 'శిశిరవేళ' పేరుతో వెలువరించిన ఈ కథాసంపుటంలో 18 కథలున్నాయి. వీటిలో 'అర్జునుడు' పెద్ద కథ. మధ్యతరగతి ప్రజల జీవితాలు, కుటుంబ నేపథ్యం, వారి కష్టసుఖాలకు నిలువుటద్దం ఈ కథా సంకలనం. గురజాడ, శ్రీపాద, కొ.కు, గోపీచంద్‌, చాసో వంటి కథకుల కోవకు చెందినవారు పెద్దిభట్ల సుబ్బరామయ్య. జీవితంలోని వాస్తవికతను... వాస్తవిక, అభ్యుదయ దృక్పథంతో విమర్శనాత్మకంగా విశ్లేషించి శిల్పాత్మకంగా రూపు కట్టించే సంప్రదాయానికి వారసుడీయన.

11, ఏప్రిల్ 2016, సోమవారం

రాయలసీమ జన జీవన చిత్రణే 'రావణ వాహనం'

రాయలసీమ నేపథ్యంలో స్థానిక ప్రజల భాష, యాస, సంస్కృతికి ప్రతిబింబం 'రావణ వాహనం' కథలు. ఈ కథా
ఈ పుస్తక రచయిత డాక్టర్‌ వేంపల్లి గంగాధర్‌ నవలా రచయిత, కథకుడు, విమర్శకుడు, సామాజిక చరిత్రకారుడు, అధ్యాపకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని తెలుగులో మొదట అందుకున్న యువ రచయిత. ఈ సంపుటిలోని కథలన్నీ రాయలసీమ జీవిత మూలాలు రచయిత దృక్పథం నుంచి, ఆయన అన్వేషణ నుంచి జాలువారిన జీవన సత్యాలు. కరువు, కక్షలు కోణాన్ని స్పృశిస్తూనే వివిధ సామాజికాంశాలను ఇతివృత్తాలుగా తీసుకున్నారు. ముఖ్యంగా సీమ ప్రజల భాష కథలలోని పాత్రధారుల భాషగా మనకు కనిపిస్తుంది... వినిపిస్తుంది.

గుభాళించనీ ...

మరులుగొలిపే సౌందర్యం నీది
ఆకర్షించే మానవత్వం నీది
దృఢమైన వ్యక్తిత్వం నీది
మూర్తీభవించిన  ప్రేమతత్వం నీది
అన్నిటికీ మించిన మనిషితత్వం నీది

మనసును గిలిగింతలు పెట్టే దరహాసం
మల్లెలలను మరిపించే సౌరభవం
నన్నోదార్చే శిశిరపు విరహం
నీ మదిలో ఎక్కడున్నానో తెలియని
అనంతమైన సంకోచం
నీ వలపు కౌగిలో బందీ కావడమేగా
నా తలపు రహస్యం

నిన్నూ నన్నూ కలిపిన భావాలు
మనసును దోచిన సంపంగెలు
మదిలో రాజుకొంటున్న ఊసులు
ముసురుకొస్తున్న కొంగొత్త ఆశలు
పోగుచేసుకొంటున్నా రాలిపోయిన కలలు
గుభాళించనీ నీ అనురాగపు బృందావనిలో...

- రాజాబాబు కంచర్ల

ఎవరునీవు..?














పగుళ్ళిచ్చిన అవనిని
ముద్దాడిన తొలకరి జల్లువో
శిశిరం మిగిల్చిన మోడును
చిగురింప జేయ వచ్చిన వసంతానివో
వడగాడ్పుల నిట్టూర్పులతో వేసారిన
మనస్సును చల్లబరిచేందుకొచ్చిన మలయమారుతానివో
చీకట్లు ముసిరిన జీవితంలో
వెన్నెల్లు కురిపించ వచ్చిన నిండుజాబిలివో
నీ స్పర్శతో సరికొత్త అనుభవాన్నిచ్చిన
నండూరి వారి ఎంకివా..
రవివర్మ చిత్రానివా
బాపూ బొమ్మవా
ఎవరు నీవు...
మోడువారిన జీవితంలో
కొత్తవెలుగులు నింపిన
నా హృదయాంగనవా...ఎవరునీవు..?

- రాజాబాబు కంచర్ల

9, ఏప్రిల్ 2016, శనివారం

శరద్రుతు వెన్నెలలు కురిపించు

 












నీ ఊసులను పల్లవిగా చేసుకొని
నా ఊహలను చరణాలుగా మలచుకొని
జ్ఞాపకాలను జావళీలుగా మార్చుకొని
పదే పదే పాడుతున్నా నా ప్రేమ గీతాన్ని

ఒంటరి నక్షత్రమై నేను మిగిలినా...
మది వీణియను శృతి చేయరావా..
వసంత గీతాన్ని ఆలపించలేవా
కరుగుతున్న కాలాన్నీ
మరుగుతున్న జీవితాన్ని అక్కున్న చేర్చుకోవా

నీ పారవశ్యంతో మూతబడుతున్న కనులు
నీ విరహంతో వేగిపోతోన్న మనసు
వెల్లువలా ఎగసిపడే భావోద్వేగాలు
గమ్యంలేని పయనాలు
దిక్సూచివై కురిపించవా శరద్రుతు వెన్నెలలు
- రాజాబాబు కంచర్ల

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

అస్పష్ట రూపం











ఊహలలో కదలాడే
ఓ అస్పష్ట రూపం
ఊహలకే జీవం పోసుకొని
ఎదుట నిలిచిన వాస్తవ సౌందర్యం...

తాను పరిచయం కాకపోయివుంటే
నా జీవిత పుస్తకంలో ఒక పుట
అస్పష్టంగా.. నిష్ప్రయోగంగా ... శాశ్వతంగా
తెరుచుకోకుండా వుండిపోయేది..

బంగారం...
ఈ కొత్త పుటను
సువర్ణాక్షరాలతో లిఖించు
గుండె గోడలపై
పచ్చబొట్టేసినంత గాఢంగా...

సప్తవర్ణాలతో చిత్రించు
మనోఫలకంపై నీ రూపాన్ని
పచ్చబొట్టసినంత పదిలంగా.

ఉగాది శుభాకాంక్షలు

ఉగాది...
షడ్రుచుల సమ్మిశ్రమం 
జీవితం...
కష్టసుఖాల సమ్మేళనం
ఈ రెండింటి కలయికే
ఉగాది వైశిష్ట్యం
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
కావాలి జనరంజకం

7, ఏప్రిల్ 2016, గురువారం

ప్రేమ కిరణమా

గుండె గుడిలో
వెలిగిన ప్రేమ కిరణమా
మమతల వాకిట
విరబూసిన ముద్ద మందారమా
అనురాగపు జ్యోతులను
వెలిగించిన ప్రియ సుప్రభాతమా

నీ తలపు నా మనసంతా వెదజల్లి

బంగారం... నువు
నవ్వితే సిరిమల్లి
నడిస్తే పిల్లగాలి
పలికితే పాలవెల్లి
సొగసే జాజిమల్లి
వయసే నిండుజాబిల్లి
నీ తలపు నా మనసంతా వెదజల్లి...

నా అక్షరంలోని ప్రతి వంపులోనూ నువ్వు

నా అక్షరంలోని ప్రతి వంపులోనూ నువ్వు
నా అక్షరంలోని ప్రతి మలుపులోనూ నువ్వు
నా అక్షరంలోని భావం నువ్వు... స్ఫూర్తీ నువ్వు
నా అక్షరంలోని స్పందన నువ్వు... ప్రతిధ్వనీ నువ్వు

అక్షరంలోని కథావస్తువే నీవై... శిల్పమూ నీవై
ఆ అక్షరాలే పదాలై.. వాక్యాలై.. భావస్ఫోరకాలై
పరవళ్లు తొక్కనీ... జావళీలు పాడనీ
నీ అధరామృతాన్ని మధుపం వలె గ్రోలనీ..
అక్షరాల వరద పారించనీ...
వరద గోదారిలా పరవళ్లు తొక్కనీ...
నీ తోడుగా పరవశించిపోనీ...
నీ రూపం మదిలో ముద్రిస్తావా
మమతల సిరులు పండిస్తా
మానవత్వాన్ని రగిలిస్తా...
అక్షరాలను ఫిరంగుల్లా పేల్చుతా..
అందుకు కావాల్సిన రెమ్యూనరేషన్
కూసింత ప్రేమ...నీ ప్రేమ మాత్రమే...బంగారం
- రాజాబాబు కంచర్ల

ఆ కనులను చూసే వరకూ తెలియదు

April 5 at 10:09am ·







‘‘ఆ కనులను చూసే వరకూ తెలియదు
కళ్లు కూడా మాట్లాడతాయని..
ఎన్నో ఊసులు చెబుతాయని...
ప్రేమిస్తాయి
కోప్పడతాయి
లాలిస్తాయి
ఆవేశపడతాయి
బాధపడతాయి
ఉత్సాహం నింపుతాయి
స్ఫూర్తినిస్తాయి...
నిజం..బంగారం
నీ కళ్లకు అంతటి శక్తి వుంది మరీ...’’

పాల సముద్రం వెలవెలబోయింది


పాల సముద్రం వెలవెలబోయింది
ఆమె ఒంటి తెలుపుచూసి
ఎర్ర తామర బెదిరిపోయింది
ఆమె అధరాల ఎరుపు చూసి
నిశిరాతిరి చిన్నబోయింది
ఆమె నల్లని కురుల నిగనిగలుజూసి
తుమ్మెదలు అలకబూనాయి
ఆమె ముంగురుల హొయలుజూసి

వినువీధిలో మెరిసిన అందాలతారవో

April 1 at 8:52pm ·

వినువీధిలో మెరిసిన అందాలతారవో
ఎదలోతులలో పలికే వలపు సితారవో
ఆ సోగ కనులు చెప్పే ఊసులేమిటో
మధురసాలొలుకు అధరాల ఆశలేమిటో
తన ఊపిరి మల్లెల పరిమళం
తన చూపులు మన్మధ కిరణం
తన సొగసే మధుర సంగీతం
తన మనసే విరజాజుల సౌకుమార్యం
ఆమె విసిరిన తొలిచూపు
రేపింది విరహపు చలి తూపు
ఎదలో రగిలింది శృంగార తాపమ్ము
ప్రియతమా..భరించజాల ఈ విరహమ్ము

నేడు మాక్సిమ్ గోర్కీ పుట్టినరోజు


మాక్సిమ్ గోర్కీ... రష్యాకు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత. ఆయన అసలు పేరు అలెక్సీ మాక్సిమోవిక్ పెష్కోవ్. మార్చి 28, 1868న రష్యాలోని నిజ్ని నోవోగార్డ్‌లో జన్మంచిన గోర్కీ.. తన తండ్రి పేరును కూడా కలుపుకుని 'మాక్సింగోర్కీ'గా ప్రాచుర్యంలోకి వచ్చాడు. సమాజం కోసం తమ జీవితాన్ని... రచనలను అంకితం చేసిన మహారచయిత మాక్సిమ్‌ గోర్కీ. ప్రపంచ సాహిత్యంలో కష్టజీవుల అభ్యున్నతికి అంకితమైన రచయితకు పర్యాయపదం గోర్కీ. ‘అమ్మ’ నవలతో ప్రపపంచ ప్రఖ్యాతిగాంచిన గోర్కీ.. అమెరికాలోని అడిరాన్ డాక్ పర్వతశ్రేణిలో ప్రవాస జీవితం గడుపుతూ... ‘అమ్మ’కు ప్రాణం పోశాడు గోర్కీ. విప్లవకారుడైన కొడుకు భావాల బాటలో నడుస్తూ ... సోషలిజాన్ని మతస్పూర్తితో కొనసాగించడం ‘అమ్మ’కు సహజం గానే అబ్బింది. ‘అమ్మ’తో ప్రపంచ ప్రసిద్ధమైన గోర్కీ మేధో ప్రస్తానం ‘అధోజనం’ ‘మధ్య తరగతులు’ అన్న ప్రసిద్ధ నాటకాల మీదుగా సాగి -‘అసందర్భ ఆలోచనలు (1918), కొత్త జీవితం (Navya Zhizn ,New Life)పత్రికలో కొనసాగి - ’ అర్టమోం వాణిజ్యం (1925) వరకూ విస్తరించింది. అమ్మ పలుమార్లు తెలుగులోకి అనువాదమయింది.
12ఏళ్ల వయసులోనే ఎన్నో కష్టాలను అనుభవించాడు. కొంతకాలం చెప్పులు కుట్టే షాపులో పనిచేశాడు. ఆ తర్వాత తాపీ పని చేశాడు. అందులోనూ గిట్టుబాటు కాకపోవడంతో ఒక ఓడలో వంట కుర్రాడుగా చేరాడు. అక్కడ మూడేళ్లు పనిచేసి, అనంతరం ఒక రొట్టెల దుకాణంలో చేరాడు. ఇలా ఎన్నిరకాల పనులు చేసినా పొట్ట గడవకపోవడంతో 1888లో ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. గోర్కీ తన పదేళ్ల వయసు నుండీ పొట్ట చేత్తో పట్టుకొని రకరకాల పనులన్నీ చేశాడు. చివరకు ఒక వర్క్ షాపులో కూలీగా చేరాడు. అప్పుడే ఆయన తన తొలి కథను ప్రచురించాడు. దాంతో ఆయన ఖ్యాతి వెలుగులోకి వచ్చింది. చిన్న కథలు రాయడంలో నిపుణుడనే పేరు వచ్చింది. క్రమంగా ఆరితేరిన రచయితగా, రష్యాలోని గొప్ప రచయితల్లో ముఖ్యుడుగా ప్రసిద్ధిగాంచాడు. ఆయన రాసిన నవలల్లో ‘అమ్మ’ (మదర్) నవల ముఖ్యమైనది. కేడెన్సు, బైస్టాండర్, మాగ్నెటు మొదలైన అనేక
నవలలను ఆయన రచించారు. చాలాకాలం యాజీన్ నవజీవన్ అనే పత్రికకు సంపాదకత్వం కూడా నిర్వహించారు.
అప్పట్లో రష్యాలోని నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు జరిగిన రష్యా విప్లవ పోరాటంలో కూడా గోర్కీ పనిచేశాడు. తన కథల ద్వారా, నవలల ద్వారా పెద్దఎత్తున ప్రచారం చేశాడు. 1905లో పీటర్స్ బర్గ్ లో జరిగిన గలాటాలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సందర్భంలో గోర్కీకి కూడా శిక్షపడింది. 1917లో జరిగిన మహావిప్లవంలో కూడా ఆయన పాల్గొన్నాడు. రష్యా విప్లవం సమయంలో అనేక సంవత్సరాలు పనిచేసి, అందులో పాల్గొన్న ఎంతో మంది వీరులను గూర్చి, విప్లవం యొక్క ఆటుపోట్లను గూర్చి బాగా అవగాహన చేసుకొన్న గోర్కీ... తన ‘అమ్మ’ నవలలో వాటన్నింటినీ కూర్చి అద్భుతమైన రచన చేయగలిగాడు. గోర్కీ కేవలం ఉద్యకారుడిగానో లేదా సాహిత్య కారుడిగానో పరిమితం కాడు. సత్యాన్వేషణలో అన్ని అవరోధాలనూ అధిగమించి నిలబడ్డ ఒక ఉన్నతమైన వ్యక్తి. అందుకు ఓనమాలు ఆయన ‘అమ్మ’ నవలలోనే దిద్దాడు. నిన్న, నేడు, రేపు తరం ఏదైనా... రచయితలందరికీ గోర్కీ జీవితం, సాహిత్యం ఓ కరదీపిక.

అందమైన సాయంత్రం

 
అందమైన ఈ సాయంత్రం
జీవితంలో మరువలేని
ఓ మధుర జ్ఞాపకం...
వయ్యారంగా...
సుకుమారంగా..
కారు దిగిన
ఆ ముగ్ధ మనోహరి
బాపు బొమ్మలా
నండూరివారి ఎంకిలా
రవివర్మ చిత్రంలా
వడ్డాది రంగుల చిత్రంలా
కనుల ముందు
సాక్షాత్కారమై....
అంతలోనే
మెరుపులా మాయమైంది...
పోతూపోతూ..
పంచ ప్రాణాలను
తనతో తీసుకుపోయిందేమో..
ప్రాణంలేని బొమ్మలా
జీవంలేని శిల్పంలా
చందస్సు లేని కవితలా
మిగిలిపోయాను...
ఎన్నిజన్మలైనా
తన కోసం...
తన చిరునవ్వుల కోసం...
తన కళ్లలోని మెరుపులను
చూడడం కోసం
ఎదురుచూస్తుంటానని
ఆమె తెలుసుకుంటే చాలు...

దరహాసం


నీ ప్రతీ దరహాసం
నా హృదయపు వాకిట నృత్యం చేస్తున్నది
నా గుండెనే నీ అందెకు మువ్వగా కట్టావేమో
నువ్వు నవ్విన ప్రతీసారి
అది ఘల్లు ఘల్లుమని సవ్వడి చేస్తున్నది

నా ప్రేమను స్వీకరిస్తావా

 
నా ప్రేమను స్వీకరిస్తావా
ప్రియనేస్తమై కడదాకా తోడుంటా
నీకు జోడీగా సరిపోనంటావా
నిన్నటి కలనై కనుమరుగవుతా

ఎదురు చూపుల్లో కరిగిపోతూ

 
ఎదురు చూపుల్లో కరిగిపోతూ
కాలం ఒడిలో ఒరిగిపోతూ
మనసులోని మౌనాన్ని ఓదార్చుతూ
సృ‌ష్టిలోని వెలుగునంతా కళ్లలో నింపుకొంటూ
ఎదురు చూస్తున్నా నీకోసం...
నవ్వుల పువ్వులన్నీ మూటగట్టి
మదిలోని ప్రేమనంతా ఒడిసిపట్టి
మనసు నిండుగ మరులను దాచిపెట్టి
చీకటిదారుల చీల్చుకొని
వేగిరమే వస్తున్నావని
ఎదురుచూస్తున్నా నిలువెల్లా కనులుచేసుకొని...

విహరిద్దామా ‘స్వేచ్ఛ’గా


రెప్ప మాటు స్వప్నమా
ఎద లోపలి చిత్రమా
ఎదుటే నిలిచిన రూపమా
నా ప్రేమ దీపమా...
విహరిద్దామా ‘స్వేచ్ఛ’గా
కొత్త బంగారులోకంలో మనమిద్దరమే..

కవిత్వ దినోత్సవం

కవిత్వ దినోత్సవం
 ---------------------------------
నన్నయ అక్షర రమ్యత
తిక్కన రసాభ్యుచిత బంధం
ఎర్రన సూక్తి వైచిత్రి
నాచనసోమన నవీన గుణ సనాతత్వం
గురజాడ పాతకొత్తల మేలు కలయిక
తీరని దాహం శ్రీశ్రీ కవిత్వం
వెన్నెల్లాంటిది జాషువా కవిత్వం
నిత్యవసంతం కృష్ణశాస్త్రి కవిత్వం
వెన్నెల్లో ఆడుకొనే అందమైన
ఆడపిల్లలు తిలక్ కవిత్వం
సినారే కవిత ప్రియురాలితో సమానం
... ఇలా ఎవరికి వారు కవిత్వం గురించి చెప్పినవి
కవిత్వ నిర్మాణం గురించిన అభిప్రాయాలే.
కవిత్వంలో ఇతివృత్తం ప్రధానం.
ఇతివృత్తానికి భావం అవసరం.
ఇతివృత్తం అంటే వస్తువు..
భావం అంటే అనుభూతి..
కవితలో భావం, వస్తువు తర్వాత ముఖ్యమైనవి పదాలు.
ఆ పదాల్లో నిపుణత వుండాలి.
కవిత్వమంటే... అక్షరాల కొలువు కాదు.
హృదయంలో పల్లవించి,
భాషలో పరిమళించే భావ స్పందన.
కవిత్వాన్ని సుఖానుభూతి కోసం కాక,
సమాజం కోసం రాసేవారు సాహిత్య ఉద్యమకారులు
ప్రపంచ కవిత్వ దినోత్సవం(21-03-2016) సందర్భంగా..
కవి మిత్రులకు, సాహితీవేత్తలకు అభినందనలు

ప్రేమనుకోనా..

‘ఇలా మనం క్షణాలలోనె దగ్గరైన వైనం
కలా నిజం ఇదేమిటంటే చెప్పలేని మౌనం
మనసులలోని రాగమే మధురస భావగీతమై
మరపుకురాని బంధమెంత గాఢమైన స్నేహమా
ప్రేమనుకోనా..’

ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావా..

March 27 at 8:55am ·

‘ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావా..
వెన్నెలంత హాయిగా
మల్లెలంత మత్తుగా
మనసంతా నిండుగా
జన్మజన్మలకు తోడుగా...’

అంబరమే దిగివచ్చి

‘అంబరమే దిగివచ్చి
అవనితోటి స్నేహం కోరింది
అవని సంబరపడి
అంబరానికి పూల దోసిలి పట్టింది
బీడువారిన ఎద వాకిట
తొలకరి జల్లు కురిసింది
శృతిలేని స్వరమున
రాగాలే పలికించింది’

ఏదో తెలియని ఒంటరితనం

ఏదో తెలియని ఒంటరితనం
మనసు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైన
జ్ఞాపకాల తుట్టిని తట్టి రేపుతుంటే...
మోమున చిరునవ్వులు వెలిగించుకొని
మనసున మంటలు చల్లార్చుతున్నా..

ఏదో తెలియని దగ్గరితనం
మోడువార్చిన శిశిరాన్ని ఊరడించి ఉగ్గడించి
జతగాడే వసంతుడై ఆశల చివుళ్లు తొడిగిస్తుంటే...
మనసున మమతలు వెలిగించుకొని
మోమున చిరునవ్వులు పూయిస్తున్నా...

ఏ వనంలో విరబూసిన మల్లెతీగవో

ఏ వనంలో విరబూసిన మల్లెతీగవో
మల్లెల పరిమళాల్ని రంగరించిన సౌందర్యానివో
నా ఎదలో గుభాళించిన పారిజాతానివో
ఈ పరిచయం కావాలి రాధామాధవుల ప్రణయకావ్యం
ఈ మమతలు కావాలి వేయిగా పెనవేసిన వసంతగీతం
నా ప్రియ నెచ్చెలీ...
నిను కనులారా వీక్షించాలని
మనసుతీరా స్ప్తృశించాలని
పరితపించే గడ్డిపువ్వును నేను...
ఇపుడు నేలరాలినా..
మళ్లీ మళ్లీ మొలకెత్తుతూనే వుంటా
ఎన్ని జన్మలైనా నిన్నందుకునేదాకా..