19, ఏప్రిల్ 2017, బుధవారం

నాటకం బతకాలి

 కావ్యేషు నాటకం రమ్యం!
నాటకాంతం హి సాహిత్యం
నాటకాంతం హి కవిత్వం
- అన్నట్టుగా...
వస్తురూపాన్నీ, భావగంధాన్నీ ఆనందాన్నీ, సామాజిక ప్రయోజనాన్నీ,
సందేశ స్వరూపాన్నీ పాఠక లోకానికీ, ప్రేక్షకులకూ
తెలియజేయడానికి
దృశ్యరూపకమైన సౌలభ్యం వుండటం వల్లనే నాటక ప్రక్రియ లలితకళల సమాహారమైంది.
రచయిత తాను చెప్పవలసిన విషయాన్ని, అందించవలసిన సందేశాన్నీ త్వరితగతిన
సామాజికుల హృదయంలో నాటడానికి, నాటకం అనువైన సాధనం.

నాటకంలోని పాత్రలు రంగస్థలంపై, హావభావాలతో, సంభాషణా చాతుర్యంతో,
పాత్రోచితమైన వేషధారణతో, ప్రేక్షక, సామాజికుల మనోఫలకంపై నిలిచిపోయేటట్లు
నవరసాలకు ప్రతినిధులై, మానవ జీవితంలోని కోణాలను ప్రత్యక్షంగా ప్రదర్శించినప్పుడు 
ఆ మాట, ఆ పాట, ఆ చేష్ట, ఆ భావం పదునెక్కి ఆశించిన ఫలితాన్నిస్తాయి.
పౌరాణికం, చారిత్రకం, సాంఘీకం - నాటక వస్తువు ఏదైనా ఉన్నత విలువలు కలిగివున్నప్పుడు,
మనిషి జీవితం అందులో ఒదిగిపోయినప్పుడు అది రసజ్ఞుల మనన్నలకు పాత్రమౌతుంది...
వారి మనోఫలకంపై ముద్రితమౌతుంది.
అప్పుడే ఆ నాటక రచయిత గానీ, నటీనటులు గానీ సఫలీకృతులైనట్టు చెప్పవచ్చు.
అలాంటి ఒక అద్భుత సన్నివేశం ఆదివారం (16-04-2017) సాయంత్రం
విజయవాడలోని ఎంబీ విజ్ఞానకేంద్రం చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియంలో ఆవిష్కృతమైంది.
***
నంది నాటకోత్సవాల్లో బంగారునంది పొందిన నాటకం ‘‘అక్షర కిరీటం’’.
రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని గంగోత్రి- పెదకాకాని వారు ప్రదర్శించిన
ఈ నాటకంలో కవిత్వం, భావావేశం పందెం వేసుకుని పరుగెడతాయి.
తెలుపురంగు స్వచ్చతకు చిహ్నం. వెలుగును దాచుకోకుండా వెదజల్లుతుంది.
నిస్వార్థ బుద్ధిలోనే సంతోష రహస్యం దాగివుంది.
ఇతరుల జీవితాల మీద వెలుగురేఖలు ప్రసరించాలనుకునే వారి మనసు
నిర్మలమైన నిత్యసంతోషానికి కారణమౌతుందనే సారాంశంతో
ఆద్యంతం వీక్షకుల మనసులను కట్టిపడేస్తుంది.
వశిష్ట... ప్రముఖ కవి, రచయిత.
సన్మానాలు, సత్కారాలు, బిరుదు ప్రదానాలు ఎన్ని జరిగినా తన స్థాయికి తగిన
గుర్తింపు లభించలేదనే అసంతృప్తితో దహించుకుపోతుంటాడు.
అతను తన రచనల్లో ప్రబోధించే ఎన్నో ఉన్నత ఆదర్శాల పట్ల
నిజజీవితంలో అంత నమ్మకం వుండదు.
తన లక్ష్యం నెరవేరే అవకాశం వచ్చినప్పుడు తన చుట్టూ అల్లుకున్న బంధాలను కూడా
లెక్కచేయకుండా తనకు అవార్డు అందుకోవడమే ప్రదానం అనుకుంటాడు.
త్యాగం నిండిన మనుషుల మధ్య, వారి విశాల హృదయం ముందు, వారి వ్యక్తిత్వం ముందు
తన పాండిత్యం ఎందుకూ కొరగాదని తెలుసుకుంటాడు.
వారి మహోన్నత వ్యక్తిత్వం ముందు తానొక మరుగుజ్జునని తలపోస్తాడు.
చివరకు కనువిప్పు కలగడంతో నాటకం ముగుస్తుంది.
***
‘వ్యాసానికీ- కవిత్వానికీ, కధకూ- కవిత్వానికీ, నాటికకూ- కవిత్వానికీ మధ్య ఉన్న రేఖలను చెరిపివేసి,
అన్ని ప్రక్రియల్ని చివరికి రేడియో నాటికలతో సహా రూపం మార్చుకున్న కవితలేమో అనిపించేటట్లు నిర్వహించడంలో
శ్రీశ్రీ వైశిష్ట్యం ప్రధానంగా ఇమిడి వుంది’ అని ‘శ్రీశ్రీ రేడియో నాటికలు- ప్రయోగవాద ధోరణులు’ అనే పుస్తకానికి
పరిచయ వాక్యాలు రాసిన బాలాంత్రపు రజనీకాంతరావు గారు (1992) పేర్కొంటారు.
అదేవిధంగా  రచయిత పి.వి.రామకుమార్ రచించిన ‘అక్షర కిరీటం’ నాటకం కూడా
నాటకానికీ - కవిత్వానికీ మధ్యనున్న రేఖను చెరిపేసి, ఒక సుందర దృశ్యాన్ని రంగస్థలంపై ఆవిష్కరిస్తుంది.
ఇందులో రచయిత వశిష్టగా నటించిన గోపీనాయుడు, వశిష్ట స్నేహితుడు సత్యం,
వశిష్ట భార్య, వశిష్ట ఇంట్లో పనిచేసే శాయిలమ్మ ప్రధాన పాత్రలు.
ఆంగికం, వాచికం, ఆహార్యంలో నటీనటుల ప్రదర్శన గొప్పగా వుంది.
వశిష్టగా నటించడమే కాకుండా దర్శకత్వ బాధత్యను కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు గోపీనాయుడు.
ప్రేక్షకులు కూడా చివరి నిమిషం వరకూ తమ సీట్ల నుంచి లేవలేదంటే...
ఆ నాటకం గొప్పదనం అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా రచయిత, కళాకారులకు అభినందనలు...
ఇలాంటి మంచి ప్రదర్శనలు మరిన్ని రావాలి...  నాటకం బతకాలి.
నాటకం తెలుగునాట పూర్వవైభం సంతరించుకోవాలి.

- రాజాబాబు కంచర్ల
18-04-2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి